బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోను కరోనా వదలనంటే వదలనని పట్టుకుకూర్చుంది. వైద్య పరీక్షలో వరుసగా మూడోసారి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చాక బయటకు తిరగడానికి కుదరదు కాబట్టే అధికార నివాసంలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటూ అక్కడి నుంచే పనులు చక్కబెడుతున్నారు బోల్సొనారో. తేలికపాటి లక్షణాలు ఉంటే రెండు వారాల తర్వాత కరోనా వైరస్ దానంతట అదే తొలగిపోవాలి..కానీ బోల్సొనారోకు మాత్రం మళ్లీ పాజిటివ్ రావడమే ఆందోళన కలిగించే అంశం. అయితే బోల్సొనారో ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించడం కాసింత ఊరట కలిగించే విషయం. కరోనా బోల్సొనారోను అంటుకోవడం ఆయన స్వయంకృతాపరాధమే! కరోనా చిన్న జలుబు మాత్రమే అంటూ తేలిగ్గా తీసుకోవడం, పైగా మాస్క్ లేకుండానే తిరగడంతోనే వైరస్ ఆయనకు అంటుకుంది. ఈ నెల ఏడున సోకిన వైరస్ ఇప్పటికీ ఆయన శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంది. ఇప్పటికీ తనకు తేలికపాటి లక్షణాలే ఉన్నాయని చెప్పుకొస్తున్నారాయన. యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను తీసుకుంటున్నానని బోల్సొనారో చెబుతున్నా, వివాదాస్పద హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం మానేయాలని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న బ్రెజిల్‌లో ఇప్పటికే 81 వేల మంది కన్నుమూశారు. 20 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.