ఆర్టికల్ 370 రద్దు విషయంలో దూకుడుగా వ్యవహరించిన మోదీ సర్కార్- ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పౌరుల జాతీయ రిజిస్టర్‌ను ఏర్పాటు చేస్తామంటోంది. అంటే భారత పౌరులు ఎవరో, అక్రమ వలసదారులెవరో తేల్చేస్తామంటోంది. కానీ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి విపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశంలో జమ్మూకాశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఆమోదింపజేసుకున్న కేంద్రం, శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొస్తోంది. బీజేపీ కేంద్రంలో మళ్లీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగానే జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దుచేసింది. పడక్బందీగా ఆపరేషన్ జమ్మూకాశ్మీర్ పూర్తిచేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని ప్రవేశపెడతామంటోంది. ఇందుకోసం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సెషన్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయంచింది. అయితే ఇందులో ఏ మతాలవాళ్లు భయపడాల్సిన పని లేదంటున్నారు హోంమంత్రి అమిత్ షా.
సార్వత్రిక ఎన్నికలకు ముందు అసోంలో ప్రక్రియ చేపట్టారు. ఒక్క అసోంలోనే 40 లక్షల మంది అక్రమ చొరబాటుదారులు ఉంటారని బీజేపీ గతంలో చెప్పుకుంది. తీరా లెక్క వేస్తే 19 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. అయితే, అప్పట్లోనే ఈశాన్య రాష్ట్రాలు ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకించాయి. అయితే, దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ చేపట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కమలనాథులపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకు సమయం వచ్చిందని ఆయన వాదన.
ఈ పరిస్థితుల్లో- అమిత్ షా ప్రకటన వెలువడిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ అమలు చేయడానికి అనుమతించేది లేదని దీదీ తేల్చేశారు. ఎన్‌ఆర్‌సీ పేరుమీద రాష్ట్రంలో అస్థిరత సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. బెంగాల్‌లో నివసిస్తున్న ప్రజల పౌరసత్వాన్ని తొలగించి, శరణార్థులుగా ఎవరూ మార్చలేరని ఆమె భరోసా ఇచ్చారు.
అటు దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. గతనెల 25న సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని చర్చించారు. జార్ఖండ్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఎన్‌ఆర్‌సీని బీజేపీ తెరమీదకు తెస్తున్నట్లు కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. పౌరసత్వం అనే అంశం ఆధారంగా మతాలపై వివక్ష చూపటం రాజ్యాంగ ఉల్లంఘనే అని తిప్పికొట్టాలని కాంగ్రెస్ దాదాపుగా నిర్ణయించింది. మొత్తంమ్మీద ఎన్‌ఆర్‌సీ అన్న అంశం ద్వారా బీజేపీ మతపరమైన అంశాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నట్లు విపక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశరాజకీయాల్లోఎన్‌ఆర్‌సీ రచ్చగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి.
ఇక ఇదే అంశంపై బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా..టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో కీలక చర్చ జరిగింది. అసలు పౌరసత్వ సవరణ బిల్లు తీసుకువచ్చి బీజేపీ ఏం చేయాలనుకుంటుదనే అంశంపై..ఆ పార్టీ నేత ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ వివరణ ఇచ్చారు. సదరు బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాస్పదం కాదని, భారతదేశ పరిరక్షణ కోసమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అస్సాం, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో చాలామంది అక్రమ వలసదార్లు..భారతీయులుగా చలామణీ అవుతున్నారని, వారిని ఏరిపడేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు. దేశం యొక్క సమైక్యతకు, సమగ్రతకు, సార్వభౌమత్వానికి నష్టం కల్గించేవారి విషయంలో కఠినంగా వ్యవహరించడంలో తప్పులేదని, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ప్రభుత్వం ఇదంతా చేస్తుందన్న విషయం అందరూ గమనించాలని పేర్కొన్నారు.