
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ప్రజలందరి బాగు కోసం ఈ చర్యలు తప్పదు. తాజాగా కరోనా కాలంలో పురుటి నొప్పులతో బాధ పడుతున్న ఓ పేద గర్భిణికి సినీ రచయిత పురుడు పోసి తన గొప్ప మనసు చాటుకున్నాడు. వెట్ట్రిమారన్ డైరెక్షన్ లో రూపొందిన సెన్సేషనల్ మూవీ ‘విచారణై’ చిత్ర రచయిత చంద్రన్. కోవైలో ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తోన్న ఈయన స్వీయ అనుభవాలతో లాకప్ పేరుతో రాసిన నవలనే వెట్ట్రిమారన్ ‘విచారణై’ పేరుతో మూవీగా తెరకెక్కించారు.
ప్రస్తుతం కరోనావైరస్ ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. చంద్రన్ ఉంటోన్న కోవై, సింగనల్లూర్ ప్రాంతంలో ఒడిశాకు చెందిన భవన నిర్మాణ కార్మికులు కొందరు రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారిలో నిండు గర్భిణికి పెయిన్స్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అది రావడం లేటు కావడంతో ఆటోడ్రైవర్ చంద్రన్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన ఆయన… అప్పటికే ఆ మహిళ ప్రసవ వేదనతో బాధపడటం గమనించారు. కరోనా భయంతో ఎవరూ ఆమె దగ్గరకు వచ్చేందుకు సాయం చెయ్యలేదు. చంద్రన్‌నే ఆ మహిళకు పురుడు పోసి తన మంచి మనసు చాటుకున్నారు.