ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ సేన తొలి ఓటమిని చవిచూసింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం సిడ్నీ మైదానం వేదికగా జరుగనుంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 308 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 90 (76 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) పరుగులు, ఓపెనర్ శిఖర్ ధావన్ 74 (86 బంతుల్లో 10ఫోర్లు) పరుగులతో పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. కాగా, కెప్టెన్ కోహ్లీ(21) నిరాశపరిచాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా దుమ్మురేపిన కేఎల్ రాహుల్(12), శ్రేయస్ అయ్యర్(2) మిడిలార్డర్‌లో విఫలమయ్యారు. కంగారుల బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్(3/55) భారత్‌ను ఆదిలోనే భారీ దెబ్బకొట్టాడు. మధ్య ఓవర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా(4/54) వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచాడు.
అంతకుముందు అతిథ్య ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ అరోన్ ఫించ్114(124 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు), స్టీవ్ స్మిత్ 105 (66 బంతుల్లో 11ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత శతకాలతో అస్ట్రేలియా గెలుపుకు బాటలు వేశారు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 69 (76 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో ఆసీస్ రికార్డు స్కోరు సాధించింది. ఆఖర్లో మాక్స్‌వెల్ 45(19 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో అస్ట్రేలియకు పరుగుల వరద పారింది. భారత బౌలర్లు ఏ సమయంలోనూ కంగారుల దూకుడును కట్టడి చేయలేకపోయారు. ఇక, భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఒక్కడే మూడు వికెట్లు తీయగలిగాడు. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీసినా ఆసీస్ ను అడ్డుకోలేకపోయారు.