
రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనితోపాటు ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తుంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ‘ఆదిపురుష్’ అనే సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో లంకేశ్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ను ఎంపిక చేశారు. ఇక ఈ మూవీలో ప్రభాస్ తమ్ముడు లక్ష్మణ్ గా నటించే హీరో పై గతకొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. మొదట్లో ఓ బాలీవుడ్ నటుడి పేరు వినిపించింది. తాజాగా కోలీవుడ్ నటుడి పేరు తెర పైకి వచ్చింది. తమిళ్ యంగ్ హీరో అథర్వను ప్రభాస్ తమ్ముడి పాత్రకు ఎంపిక చేసారని అంటున్నారు. అథర్వ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దల కొండ గణేష్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అంతకు ముందు అథర్వ నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకూడా డబ్ అయ్యాయి. ఇప్పుడు యంగ్ హీరోకు ఆదిపురుష్ లో ఆఫర్ వచ్చినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కు తమ్ముడిగా అథర్వ సెట్ అవుతాడని భావించిన దర్శకనిర్మాతలు అతడిని సంప్రదించారని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.