ఢిల్లీ-హర్యానా బోర్డర్ లో రైతులు చేస్తున్న ధర్నా స్థలాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఉదయం సందర్శించారు. తన కేబినెట్ సహచరులతో కలిసి సింఘు సరిహద్దుల్లో అన్నదాతలను ఆయన పరామర్శించారు. రైతుల అన్ని డిమాండ్లను తాము సమర్థిస్తున్నామని, వారి కోర్కెలు న్యాయ సమ్మతమైనవని ఆయన చెప్పారు. మా పార్టీతో బాటు తాను కూడా మొదటి నుంచీ వారి ఆందోళనకు మద్దతునిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నదాతలను ఉంచేందుకు 9 స్టేడియాలను జైళ్లుగా మార్చేందుకు అనుమతించాలని పోలీసులు కోరారని, కానీ తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఆయన చెప్పారు. నేను ఇక్కడికి సీఎం గా రాలేదు..మీ సేవకుడిగా వచ్చాను అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ నెల 8 న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు తాము పూర్తి మద్దతునిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా బుధవారం అన్నదాతలు కేంద్రంతో ఆరో దఫా చర్చలు జరపనున్నారు.
ఇప్పటికే వారు తాము అనుసరించాల్సిన వ్యూహంపై తమలో తాము చర్చించుకున్నారు. రైతు చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండు నెరవేరే వరకు వెనక్కి వెళ్లరాదని వారు తీర్మానించారు.