Memos to Panchayati Raj Officials : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం, ఏపీ సర్కార్ మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవంటూ ఎన్నికలు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లేక్కుతుంటే.. ఆగమేఘాల మీద ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంబంధిత అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఈ సందర్భంగా అధికారుల తీరుపట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. రేపు పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిద్దరికీ ఎస్ఈసీ మెమోలు జారీ చేశారు.
ఈ ఉదయమే సమావేశం నిర్వహించాలని ఎస్‌ఈసీ భావించినప్పటికీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లు సీఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు వారితో సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఆ సమయానికి ఇద్దరు అధికారులు రాకపోవడంతో ఎస్‌ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపీ సర్కారు వేసిన పిటిషన్‌పై సందిగ్ధత నెలకొంది. కోర్టు సమయం ముగియడంతో అత్యవసర విచారణకు శుక్రవారం సమయం దొరకలేదు. ఇక, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దాన్ని సరిచేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పిటిషన్ వెనక్కివచ్చేయగా, మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్‌ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని న్యాయవాదులు చెబుతున్నారు.