ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీడీపీ తమ స్ట్రాటజీని అమలు చేస్తోంది. రూల్ 71పై చర్చకు అనుమతించాల్సిందే అంటూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగడంతో..ఛైర్మన్ రూల్స్ ప్రకారం అందుకు అనుమతించారు. అంతకముందు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. మంత్రుల బిల్లులను మొదట ఛైర్మన్ పరిగణలోకి తీసుకున్నారు. అయితే రూల్ 71 నోటీసు ఇస్తే..దాన్ని చర్చకు ఆహ్వానించకపోవడం పట్ల టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద నిరసనకు దిగారు. దీంతో ఛైర్మన్ రూల్ 71పై చర్చకు అనుమతిచ్చారు. దీంతో రెండు గంటల పాటు నోటీసుపై చర్చ జరగనుంది. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చర్చను ప్రారంభించారు.
శాసన మండలిలో మొత్తం స్థానాల సంఖ్య 58 :
టీడీపీ ఎమ్మెల్సీలు సంఖ్య 34
వైసీపీ ఎమ్మెల్సీలు సంఖ్య 9
పీడీఎఫ్ ఎమ్మెల్సీలు సంఖ్య 6
ఇండిపెండెంట్ ఎమ్మెల్సీల సంఖ్య 3
బీజేపీ ఎమ్మెల్సీల సంఖ్య 2
కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య 1
మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి
మండలిలో బిల్లు ఆమోదం పొందకపోతే :
బిల్లుపై పూర్థి స్థాయి చర్చ జరిగి ఆమోదం పొందకపోతే, బిల్లు తిరిగి శాసనసభకు వెళ్తుంది. అక్కడ మరోసారి సభ బిల్లుకు ఆమోదం తెలిపితే..మళ్లీ మండలికి వస్తుంది. రెండోసారి కూాడా బిల్లును శాసనమండలి వ్యతిరేకిస్తే..అది ఆమోదయోగ్యం కానిదిగానే పరిగణిస్తారు.