Antarvedi Rathodsavam: జన సంధ్రమైన అంతర్వేది.. వైభవంగా శ్రీ లక్ష్మీనృసింహ స్వామి రథోత్సవం

|

Feb 23, 2021 | 9:02 PM

అంతర్వేది జన సంధ్రమైంది. ఇసకేస్తే రాలనంత జనం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేవదేవుడి వైభోగాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Antarvedi Rathodsavam: జన సంధ్రమైన అంతర్వేది.. వైభవంగా శ్రీ లక్ష్మీనృసింహ స్వామి రథోత్సవం
rathotsavam in antarvedi temple
Follow us on

Antarvedi Rathodsavam: అంతర్వేది జన సంధ్రమైంది. ఇసకేస్తే రాలనంత జనం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేవదేవుడి వైభోగాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకూ జరిగింది ఒక్క ఎత్తు. ఇవాళ జరిగింది మరో ఎత్తు. అదే తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. ఓ వైపు భీష్మ ఏకాదశి, మరోవైపు కొత్త రథాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గుర్రకల్లమ్మ గుడి దగ్గరికి పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత కొత్తరథంపై కొలువైన నారసింహస్వామి భక్తుల జయ జయ నినాదాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.

తెలుగురాష్ట్రాల నుండి ఒక రోజు ముందుగానే భక్తులు పెద్దసంఖ్యలో అంతర్వేదికి చేరుకున్నారు. స్వామివారి కళ్యోణోత్సవం కన్నులపండువగా జరిగింది. స్వామివారికి మంత్రి వేణుగోపాలస్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామునే సముద్ర స్నానాలు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అంతర్వేది రథోత్సవాన్ని పురష్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు అంచనాకు మించి భక్తులు తరలిరావడంతో ఆలయ అధికారులు తయారు చేసిన భోజన ఏర్పాట్లు సరిపోలేదు. దాంతో ప్రైవేట్‌ స్వచ్చంధ స్థంస్థలు ముందుకు వచ్చి అన్నప్రసాదం ,మంచినీళ్లు పంపిణీ చేయడంతో భక్తులు సేద తీరారు.

అంతకుముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మించిన కొపనాతి కృష్ణమ్మకు అగ్నికుల క్షత్రియులు అందరూ గజమాల వేసి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోపనాతి కృష్ణమ్మ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు పూలమాల వేశారు. అంతర్వేది ఆలయానికి 15 వందల ఎకరాలు దానం చేసిన కోపనాతి కృష్ణమ్మ కుటుంబసభ్యులను ఇప్పటివరకూ ఆలయ ట్రస్టు సభ్యునిగా నియమించలేదని స్థానిక చిట్టిబాబు ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి …అగ్రికుల క్షత్రియులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే చిట్టిబాబు చెప్పారు.

మొత్తానికి రథోత్సవం వేడుకలు ప్రశాంతంగా జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ నెల 27వ తేదీన పౌర్ణమి స్నానాలకు కూడా అంతర్వేదికి పెద్ద యెత్తున భక్తులు తరలి రానుండటంతో …ఆ దిశగా ఆలయ అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు