గత కొద్దిరోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో దివీస్ ల్యాబ్ వద్ద జరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు, మత్స్యకారులు, స్థానికుల ఆందోళనకు గల కారణాలపై దివీస్ యాజమాన్యంతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చర్చలు జరిపారు. ప్రజల అభ్యంతరాలు పరిష్కారం జరిగే వరకూ దివీస్ ఒక్క ఇటుక కూడా కదపకూడదని మంత్రి స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దివీస్ పరిశ్రమ స్థాపిస్తే వచ్చే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ఆ యాజమాన్యంతో మంత్రి మేకపాటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫార్మా కంపెనీతో వెలువడే కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట వేయాలని, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలపై ప్రభుత్వం దివీస్ యాజమాన్యంతో శనివారం చర్చలు జరిపింది.
కాగా, ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలకు సానుకూలమని దివీస్ పరిశ్రమ డైరెక్టర్ కిరణ్ దివి మంత్రికి వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయమందించేందుకు సిద్ధమన్నారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న రైతులు, మత్స్యకారులపైన పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని కిరణ్ దివి వెల్లడించారు.