చిరు వ్యాపారులకు ఏపీ సర్కార్ చేయూత.. ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

|

Nov 25, 2020 | 1:22 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారు.

చిరు వ్యాపారులకు ఏపీ సర్కార్ చేయూత.. ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
YS Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను అందించారు. ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. కాగా, అర్థికంగా చితికిపోతున్న పేద కుటుంబాలను ఆదుకునేందుకే ఈ పథకం తీసుకువచ్చినట్లు సీఎం జగన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది చిరు వ్యాపారులు అధిక శాతం వడ్డీలతో అప్పులు తెచ్చుకుని అష్టకష్టాలు పడుతున్నారన్నారు. వారిని ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న పళ్ల వ్యాపారులు, చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులవుతారన్నారు.

జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు 6.40 లక్షల మంది చిరువ్యాపారులను గుర్తించామన్నారు. 10 లక్షల మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో చిరు వ్యాపారుల కష్టాన్ని చూశానని సీఎం జగన్‌ అన్నారు. చిరువ్యాపారులకు శ్రమ ఎక్కువ.. లాభం తక్కువని అన్నారు. చిరు వ్యాపారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తామన్నారు. చిరువ్యాపారులు లేకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా నడవదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది లబ్ధిదారులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

‘లబ్ధిదారుల జాబితాను ఇదివరకే ప్రకటించాం. ఈ పథకంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే.. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మీపేరు ఉందో, లేదో చూసుకోండి. లేకపోతే దరఖాస్తు చేసుకోండి, పరిశీలన చేసి నెలా, 2 నెలల్లోపే వీరందరికీ కూడా న్యాయం జరుగుతుంది. నెలరోజుల వరకూ ఈస్కీం పొడిగించబడుతుంది. ఎవ్వరికీ కూడా ఎగరగొట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాలన్నదే ఆలోచన’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.