Bird Flu Scare: ఒకవైపు కరోనా, మరోవైపు న్యూ ‘స్ట్రెయిన్’తో ప్రజలకు అల్లాడిపోతుంటే.. తాజాగా దేశంలో మరో వైరస్ దాడికి సిద్ధమవుతోంది. అదే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా(బర్డ్ ఫ్లూ). ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలపై బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఫ్లూ నివారణ చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలకు సూచనలు ఇచ్చింది.
అలాగే కేంద్ర పశుసంవర్ధక శాఖ.. ఎల్లప్పుడూ పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అలాగే చనిపోయిన పక్షులను ప్రోటోకాల్ ప్రకారం పూడ్చి పెట్టాలని ఆదేశించింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా నేషనల్ పార్క్స్, వన్యప్రాణుల అభయారణ్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
కాగా, తొలుత రాజస్థాన్‌లో ‘బర్డ్ ఫ్లూ’ కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా కేరళలోని రెండు జిల్లాల్లో, అటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ మరికొన్ని కేసులు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా(బర్డ్ ఫ్లూ)గా తేలాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ నెలకొంది. కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బాతులు, కోళ్లు ఉన్నపళంగా మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల్లో 12 వేల బాతులు చనిపోయాయి.
వాటి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించగా వాటిలో ఏవియన్ ఫ్లూ కారక H5N8 వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ అని.. పక్షుల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు తెలిపారు. దీనితో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాయి. కాగా, వలస పక్షుల వల్ల బర్డ్ ఫ్లూ ప్రమాదం పొంచి వున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు.
Also Read:
కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!
మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..
ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!