బ్రిటన్ తమ దేశ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటు గురించి ఇలా ప్రకటించిందో, లేదో భారత వైద్య వర్గాలు కూడా మన దేశీయ వ్యాక్సిన్ గురించి వెల్లడించాయి. దేశంలో ఇప్పుడు రెండు, మూడు కోవిడ్ 19 వ్యాక్సిన్లు తుది ట్రయల్ దశలో ఉన్నాయని, ఈ నెలాఖరుకు లేదా జనవరి ఆరంభానికి దీని అత్యవసర వినియోగానికి భారత రెగ్యులేటరీ సంస్థల నుంచి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఈ సంస్థల నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే రానున్న రెండు, మూడు నెలల్లో ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ టీకామందులు సురక్షితమైనవని డేటా అందిందన్నారు. 70 వేల నుంచి 80 వేల మంది వలంటీర్లకు వీటిని ఇచ్చామని, ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు తెలియలేదన్నారు. షార్ట్ టర్మ్ వ్యాక్సిన్ సేఫ్ అని తేలింది అని డా. గులేరియా పేర్కొన్నారు.
ఓ వ్యాక్సిన్ ట్రయల్ దశలో చెన్నైలో ఒక వ్యక్తికి రియాక్షన్ కలిగినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ ఆయన, ఆ కేసు బహుశా వ్యాక్సిన్ కి సంబందించినది కాకపోయి ఉండవచ్చు అన్నారు. అనేకమందికి టీకా మందు ఇచ్చినప్పుడు వారిలో కొందరికి ఇతర వ్యాధులేవైనా ఉండవచ్చునన్నారు. అంతే తప్ప ఈ టీకా మందుకు దానికి సంబంధం లేదన్నారు. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం హర్షణీయమని గులేరియా పేర్కొన్నారు. మరో 3 నెలలు మనం మంచి బిహేవియర్ పాటిస్తే ఇంకా తగ్గుతాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మాస్కుల ధారణ వంటి వాటిని ప్రస్తావించారు.