Adilabad road transport: హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రమాదకరమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది నిర్లక్ష్యంతో, రకరకాల కారణలు చెబుతూ హెల్మెట్ ధరించడానికి నిరాకరిస్తుంటారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో చనిపోయే వారిలో హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ప్రజల్లో.. హెల్మెట్ వాడకంపై అవగాహన పెంచే క్రమంలో ఆదిలాబాద్ రవాణా శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2021, జనవరి 1 నుంచి నో హెల్మెట్.. నో పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్‌ల యజమానులతో సమావేశాలు నిర్వహించి అధికారులు చర్చించారు. హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ పోయవద్దని ఆదేశించారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రదేశాల్లో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల లెక్కల ప్రకారం ఈ ఏడాది జిల్లాలో 78 ద్విచక్రవాహన ప్రమాదాలు జరగగా.. 43 మంది మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు.