అందం, అభినయం కలబోసిన నయనతారకు హాప్పీ బర్త్‌డే !

|

Nov 18, 2020 | 1:05 PM

విఘ్నేశ్‌ అన్నాడని కాదు కానీ నయనతార నిజంగానే బంగారం..! పోతపోసిన సౌందర్యం... అద్భుతమైన అభినయం.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగలగడం ఆమెకు మాత్రమే..

అందం, అభినయం కలబోసిన నయనతారకు హాప్పీ బర్త్‌డే !
Follow us on

విఘ్నేశ్‌ అన్నాడని కాదు కానీ నయనతార నిజంగానే బంగారం..! పోతపోసిన సౌందర్యం… అద్భుతమైన అభినయం.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగలగడం ఆమెకు మాత్రమే సాధ్యం. నాలుగు పదుల వయసుకు చేరువలో ఉన్నా ఏ మాత్రం తగ్గని అందం ఆమె సొంతం. ఆమె లేడి సూపర్‌స్టార్‌కు అచ్చమైన నిర్వచనం. ఇవాళ ఆమె జన్మదినం.. వరుస విజయాలతో దూసుకుపోతున్న నయనతార గురించి కొంచెం క్లుప్తంగా…
నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్‌.. ఆమె తల్లిదండ్రులు కురియన్‌ కొడియట్టు, ఓమన్‌ కురియన్‌.. వీరి స్వస్థలం కేరళే అయినప్పటికీ ఓమన్‌ కురియన్‌ కురియన్‌ పని చేసింది ఎయర్‌ఫోర్స్‌లో కాబట్టి దేశమంతా చుట్టాల్సి వచ్చింది. నయనతార పుట్టింది బెంగళూరులో.. బాల్యమంతా గడిచింది ఉత్తరాదిలో.. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ కంప్లీట్‌ చేసిన నయనతార కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ చేశారు.. కొన్ని రోజుల పాటు టీవీ యాంకర్‌గా కూడా పని చేశారు. మోడలింగ్‌ చేస్తున్న సమయంలోనే మలయాళ దర్శకుడు సత్యన్‌ అందికాడి నయన్‌కు సినిమాలో ఆఫర్‌ ఇచ్చారు.. మొదట కాదన్నప్పటికీ, సత్యన్‌ అందికాడి అంతటి దర్శకుడు అడిగారు కాబట్టి సరే అన్నారు.. అలా ఆమె మొదటి సినిమా మనసినక్కరే 2003లో విడుదలయ్యింది.. ప్రజాదరణ పొందింది. ఒక్క సినిమా చేసి వదిలేద్దామనుకున్న నయన్‌కు వెంట వెంట ఆఫర్లు రావడం మొదలయ్యాయి.. అలా రెండేళ్లలో ఎనిమిది సినిమాలు చేశారు నయనతార! 2005 నయన్‌ నటజీవితాన్ని మలుపుతిప్పిన సంవత్సరం.. ఆ ఏడాది చంద్రముఖి, గజని సినిమాలు వచ్చాయి.. ఆ మరుసటి ఏడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చారు నయన్‌.. అలా తెలుగులోనూ సక్సెసయ్యారు. శ్రీరామ రాజ్యం సినిమాలో సీతగా అసమాన నటనను కనబర్చారు. నంది అవార్డు కూడా అందుకున్నారు. హీరోయిన్‌ ఓరియంటేడ్‌ సినిమాలలో నటించి లేడి సూపర్‌స్టార్‌ అయ్యారు. డోరా, ఐరా,కర్తవ్యం సినిమాలు ఇలాంటివే! 17 ఏళ్లుగా కథానాయికగా నటిస్తున్న నయనతార.. కెరీర్‌ పరంగా సాధించాల్సింది చాలా ఉందని వినమ్రంగా చెప్పుకుంటారు.. తనకంటే సౌందర్యరాశులు, తనకంటే బాగా నటించేవారు చాలా మంది ఉన్నా .. ఏదో అదృష్టం కలిసిరాబట్టి ఈ స్థాయికి వచ్చానని వినయంగా చెబుతారు. అయితే కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోలేదని, బాగా కష్టపడ్డానని అంటారు. నయనతారకు హాపీ బర్త్‌డే!