రూ. 15 వేల వరకు ఆస్తిపన్ను చెల్లించే వారు రూ.50 చెల్లిస్తే చాలని జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ రాయితీ పొందాలంటే ఆధార్, ఇతర వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలి. లబ్దిదారులు ఆ రాయితీని సులభంగా పొందేందుకు వీలుగా ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు వివరాలు సేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆస్తులకు ఆధార్ అనుసంధానం ద్వారా ప్రభుత్వం నుంచి ఎవరు లబ్ది పొందారు..? లబ్దిదారులకు ఈ ప్రయోజనం అందిందా లేదా..? అనే విషయాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. వీటిపై జీహెచ్ఎంసీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
అయితే ఆధార్ కార్డు లేనివారి విషయంలో ఏం చేయాలనే విషయం దానిపై జీవోలో స్పష్టతనిచ్చారు. రిజిస్ట్రేషన్ రసీదుతో పాటు లబ్దిదారులకు చెందిన పాన్ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, తహసీల్దారు ధృవీకరణించిన పత్రం, బ్యాంక్, పోస్టాఫీసు, పాస్ బుక్, ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, ఒక వ్యక్తి పేరిట ఒకటికి మించి ఆస్తులుంటే ఒకే ఆస్తి రాయితీ వర్తిస్తుందా..? అన్నింటికా..?అన‌్న విషయమై ఉత్తర్వుల్లో ఎక్కడ ప్రస్తావించలేదు. ఉత్తర్వుల్ఓల ఉన్న ప్రకారమే రాయితీ వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.