ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో పెద్ద దేశమైన భారత్ లో కరోనా వైరస్ ప్రవేశించి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. పోయినేడు జనవరి 30న తొలి పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి10న తొలి కరోనా మరణం వెలుగుచూసింది. ఈ క్రమంలో దాదాపు పదకొండు నెలల పాటు జడలు విప్పింది మహమ్మారి. 2020 డిసెంబరు 19 నాటికి భారత్ కరోనా కోటి పాజిటివ్ కేసుల సంఖ్యను చేరుకుంది. జనవరి 30, 2020న భారత్ లో తొలి కేసు.. కేరళలోని త్రిశూర్ కి చెందిన విద్యార్థికి నమోదైంది. చైనాలోని వూహన్ లో చదువుతూ కేరళకు తిరిగి వచ్చిన విద్యార్థికి కరోనా సోకడంతో భారత్ కలవరపాటుకు గురైంది.
ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచదేశాల్లో కరోనా తీవ్రత, మరణాల దృష్ట్యా 24 మార్చి 2020న మొదటిసారిగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. 14 ఏప్రిల్ 2020 మే 3 వరకూ లాక్‌డౌన్ పొడిగించారు. 01 మే 2020 మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటన. ఇక, 1 జూన్ 2020 మొదటి అన్‌లాక్ ప్రక్రియను కేంద్రం ప్రకటించి, క్రమక్రమంగా లాక్ డౌన్ సడలింపు కార్యక్రమం విడతలవారీగా చేపట్టింది.
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న వేళ భారత్ తన టీకా ప్రయత్నాల్ని అప్రతిహతంగా సాగించగలిగింది. 03 ఆగష్టు 2020 ఆక్స్‌ఫర్ట్ వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతినిచ్చింది. 16 నవంబర్ 2020 భారత్ బయోటెక్ మూడో దశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. 02 జనవరి 2021 భారత్ లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతిచ్చింది. కరోనా మహమ్మారి కోరలు పీకే పనిలో భాగంగా 16 జనవరి 2021 కరోనా వ్యాక్సినేషన్ భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమయింది.
ఇలా ఉండగా, 29 జనవరి 2021 నాటికి దేశంలో మొత్తం కరోనా కేసులు 1,07,01,193 కాగా, కరోనా వల్ల మరణించినవారు ఇప్పటివరకూ 1,53,847 మంది ఉన్నారు. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 96 శాతంగా ఉంది. ఇదిలాఉంటే, అభివృద్ధి సాధించిన దేశాలలో ఇంకా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అనేక దేశాలలో ఇప్పటికీ భారీగానే కరోనా కేసులు నమోదౌతున్నాయి. అమెరికాలో రోజుకి లక్షన్నరకు పైగా పాజిటివ్ కేసులు నమోదౌతుంటే, బ్రిటన్‌లో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ వణికిస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకూ నమోదైన స్ట్రెయిన్ రకం కరోనా కేసులు 165.
మరో విచిత్రమైన విషయం భారత్‌లో జరిగింది. అదేంటంటే, ఇప్పటికే 30 కోట్ల మందికి పైగా భారతీయులలో వాళ్లకి తెలియకుండానే కరోనా వచ్చిపోయిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో కనీసం 10 కోట్ల మందిలో బయటపడకుండానే కరోనా సోకిందని ఐసీఎంఆర్ తెలిపింది. మరోవైపు, భారత్ హెల్త్ ఇమ్యూనిటీ సాధించి ఉంటుందని కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అంచనాలు కట్టారు.