హైదరాబాద్ మహానగరంలో దారుణంలో చోటుచేసుకుంది. తెలిసినవాడే కదా అని నమ్మి వెళ్లినందుకు.. ఓ మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆపై ఆమెను హతమార్చేందుకు యత్నించాడో వ్యక్తి. అపస్మారకస్థితికి చేరుకున్న బాధితురాలు రాత్రంతా ఘటనా స్థలంలోనే అచేతనంగా పడి ఉంది. మరుసటి రోజున మెలకువ వచ్చి సమీపంలోని పుట్టింటికి వెళ్లింది. కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు, బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ(50) స్థానికంగా కూలి పనిచేసుకొని జీవిస్తోంది. భర్తతో గొడవలు రావడంతో విడిగా తన తల్లితో కలిసి మూసాపేట ప్రాంతానికి చెందిన యాదవబస్తీలో ఉంటోంది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాలకు చెందిన సెంట్రింగ్ మేస్త్రీ లుకలాపు రాము (38) 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి మూసాపేటలో ఉంటున్నాడు. ఇదే క్రమంలో పక్కింట్లో ఉండే రాముతో పరిచయం ఏర్పడింది. అతడు మేస్త్రిగా పనిచేస్తుండడంతో అతడితోపాటే మహిళ కూడా పనికి వెళ్లేది. ఈనెల 25వ తేదీ రాత్రి పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా బైక్‌పై దింపుతానని రాము ఆమెను నమ్మించాడు.
అతడు ఆమెను బైక్‌పై తీసుకెళ్తూ మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం బండరాయితో ఆమె తలపై కొట్టడంతో ముఖానికి బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. శనివారం ఉదయం మెలకువ వచ్చాక చూస్తే.. తన ఒంటిపై దుస్తులు సరిగా లేకపోవడంతో లోదుస్తులతోనే సమీపంలోని తమ ఇంటికి పాక్కుంటూ వెళ్లింది. తల్లి సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. 108లో బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు రాము కుటుంబ సభ్యులు సహా పరారయ్యాడు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం కూకట్‌పల్లి పోలీసులు గాలిస్తున్నారు.