2020 Round up about corona: కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది.. తీవ్రత తగ్గినా ఇప్పటికీ కరోనా నివురు గప్పిన నిప్పులా మనల్ని వెంటాడుతూనే ఉంది. మానవజాతి గతంలో ఎన్నడూ చూడని విపత్తును 2020లో చూసింది. చాలా మంది ఈ ఏడాదిని గుర్తు చేసుకుంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. భూమిపై మనిషి జీవిస్తోన్న అన్ని ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలోని వూహాన్ పట్టణంలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ 19 వైరస్ మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికాను కూడా వదల్లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ టీవీల్లో కరోనా గురించే చర్చ… కేసులు, మరణాలు ఇలా టీవీ ఆన్ చేస్తే చాలు కరోనా వార్తలే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మానవజాతిని ఆ స్థాయిలో ప్రభావితం చేసింది కరోనానే. 2019లో ఈ వైరస్ వెలుగు చూసినా 2020లో తన విశ్వ రూపాన్ని చూపించింది. ఇక ఏడాది ముగుస్తోన్న సందర్భంలో అసలు కరోనా ఎప్పుడు మొదలైంది.. ఎలా వ్యాపించింది.. లాంటి వివరాలను ‘2020 రౌండప్’లో చూసేద్దాం..
ప్రపంచం..
* చైనాలోని వూహాన్ పట్టణంలో ఉన్న నాన్ వెజ్ మార్కెట్లో తొలిసారి ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది.
* వైరస్ గురించి చైనా చాలా ఆలస్యంగా ప్రపంచానికి తెలియజేసింది.
* 2019 డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్యం సంస్థ తొలిసారి ఈ వైరస్‌ను పరిగణలోకి తీసుకుంది.
* ఇదొక కొత్త వైరస్ అని జనవరి 9న పరిశోధకులు గుర్తించారు. ఇది ఇతరులకు వ్యాపిస్తుందని వెల్లడించారు.
* కొవిడ్19 కారణంగా జనవరి 11న తొలి మరణం సంభవించింది.
* ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సుమారు 8 కోట్ల మందికి సోకింది.
* కరోనా కారణంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 17 లక్షల మందికిపైగా మరణించారు.
* సుమారు కోటి 90 లక్షల కేసులతో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మూడున్నర లక్షల మరణాలు సంభవించాయి.
* బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ లాంటి దేశాలు ఈ వైరస్ దాడికి తల్లడిల్లిపోయాయి.
* బ్రెజిల్‌లో 73 లక్షల కేసులు నమోదుకాగా రెండు లక్షలకుపైగా మంది మరణించారు.
* మార్చి తర్వాత అలెర్ట్ అయిన ప్రపంచ దేశాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్ దిశగా అడుగులు వేశాయి.
* అనంతరం అవసరాలు, ఆర్థిక వ్యవస్తలను దృష్టిలో పెట్టుకొని అన్‌లాక్‌లు ప్రకటిస్తూ వస్తున్నాయి.
* తాజాగా బ్రిటన్ కేంద్రంగా స్ట్రెయిన్ పేరుతో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. దీంతో మరోసారి ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.
దేశం..
* భారత్‌లో తొలికేసు జనవరి 30న కేరళలో నమోదైంది.
* మార్చి 22న ప్రధాని నరేంద్ర మోది ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలు 14 గంటలపాటు జనతా కర్ఫ్యూని పాటించారు.
* మార్చిన 24న 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటన చేశారు.
* ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఆంక్షలను దేశవ్యాప్తంగా మే3 వరకు కేంద్ర ప్రభుత్వం పొడగించింది.
* అనంతరం మే 1 దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
* మే 4 నుంచి 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మార్చి 9 న మిజోరాం ప్రభుత్వం బంగ్లాదేశ్,మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశారు.
* ఇక జూన్ 1 నుంచి మూడు దశల్లో అన్‌లాక్ ప్రక్రియను మొదలు పెట్టింది.
* కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.
* లాక్‌డౌన్‌తో దేశం మొత్తం స్థంభించి పోయింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు.