
సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఈ రోజున ఒక విధ్వంసం సంభవించింది. చావు నీటి రూపంలో ముంచుకొచ్చింది. ఒక్కసారిగా సంద్రాన్ని దాటి… భూవిపైకొచ్చింది… కోట్లాది మందిని ముంచింది… లక్షలాది మందిని చంపేసింది. అదే 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామి…
2004 డిసెంబరు 26న హిందూ మహా సముద్రంలో సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామీ 14 దేశాల్లో సుమారు 2,30,000 మందిని పొట్టనబెట్టుకుంది. దీని పరిమాణం 9.1–9.3 గా నమోదయ్యింది. భారత భూభాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు, బర్మా భూభాగానికి చెందిన టెక్టానిక్ ప్లేట్లతో రాపిడి చెందడం వల్ల సముద్రగర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. ఫలితంగా సముద్రపు అలలు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి పడి తీర ప్రాంతాలను ముంచి వేశాయి. ఈ విపత్తు వల్ల ఇండోనేషియా తీవ్రంగా నష్టపోయింది. శ్రీలంక, భారతదేశం, థాయ్ లాండ్ దేశాలు కూడా ఈ భూకంపం ధాటికి నష్టపోయాయి. ప్రపంచలోనే అత్యంత ఘోరవిపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది.
సీస్మోగ్రాఫు మీద రికార్డయిన మూడో అతి పెద్ద భూకంపం ఇది. భూమి ఇప్పటిదాకా ఏ భూకంపంలో గుర్తించనంతగా 8.3 నుంచి 10 నిమిషాల పాటు కంపించింది. భూగ్రహం మొత్తం ఒక సెంటీ మీటరు మేర వణికింది. అంతే కాకుండా ఎక్కడో దూరాన ఉన్న అలస్కాలో దీని ప్రభావం కనిపించింది. ఇండోనేషియా ద్వీపమైన సైమీల్యూ, ఇండోనేషియా ప్రధాన భూభాగం మధ్యలో కేంద్రంగా ఈ భూకంపం ఏర్పడింది. ఈ భూకంపం పరిమాణాన్ని మొదటగా 8.8 గా ప్రకటించారు. తర్వాత ఫిబ్రవరి 2005లో శాస్త్రజ్ఞులు దీన్ని మళ్ళీ 9.0 కి సవరించారు. ఫసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ దీన్ని ఆమోదించింది. 2006 లో జరిపిన పరిశోధనల ప్రకారం దాని పరిమాణం 9.1 – 9.3 ఉండవచ్చునని తేల్చారు. క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డాక్టర్ హిరూ కనమోరి దీని పరిమాణం ఉజ్జాయింపుగా 9.2 ఉండవచ్చునని అంచనా వేశాడు.
2004లో సంభవించిన సునామి కారణంగా 14 దేశాలు గజగజలాడాయి. అనధికారిక లెక్కల ప్రకారం 10 లక్షల మంది సునామికి బలయ్యారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది జీవనోపాధి కోల్పోయారు. ఇళ్లు కోల్పోయారు. కూడు, గూడు కరవై దీనాస్థితికి చేరుకున్నారు. అయితే బాధితుల కష్టాలను చూసి ప్రపంచం మొత్తం మానవతా ధృక్పథంతో స్పందించి సుమారు 14 బిలియన్ డాలర్లు సహాయం అందించింది.