గత చరిత్ర…నేడు పరిటాల రవి వర్థంతి..

రాయలసీమ రాజకీయ నాయకుడు, నక్సలైట్, ఫ్యాక్షనిస్టు, సామాజిక సేవకుడు. మేధావి, దుస్సాహసికుడు, ఒంటెత్తు తత్వమనిషి, ఆదర్శ నాయకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు ఇలా ఎవరికి వారే పరిటాల రవి స్వభావం గురించి చెప్పే మాటలు. ఏళ్లు గడుస్తున్నా..ఆయన గురించి సీమ ప్రజలు మర్చిపోరు. మర్చి పోలేరు. అంతగా పరిటాల రవితో వారికి బంధం పెనవేసుకుపోయింది. పోకిరి సినిమాలో మహేష్ బాబు కోసం విలన్ ప్రకాష్ రాజ్..నాజర్ ను ప్రశ్నించిన దృశ్యాన్ని గుర్తు చేసుకోవచ్చు. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పినా […]

గత చరిత్ర...నేడు పరిటాల రవి వర్థంతి..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 24, 2020 | 2:31 PM

రాయలసీమ రాజకీయ నాయకుడు, నక్సలైట్, ఫ్యాక్షనిస్టు, సామాజిక సేవకుడు. మేధావి, దుస్సాహసికుడు, ఒంటెత్తు తత్వమనిషి, ఆదర్శ నాయకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు ఇలా ఎవరికి వారే పరిటాల రవి స్వభావం గురించి చెప్పే మాటలు. ఏళ్లు గడుస్తున్నా..ఆయన గురించి సీమ ప్రజలు మర్చిపోరు. మర్చి పోలేరు. అంతగా పరిటాల రవితో వారికి బంధం పెనవేసుకుపోయింది. పోకిరి సినిమాలో మహేష్ బాబు కోసం విలన్ ప్రకాష్ రాజ్..నాజర్ ను ప్రశ్నించిన దృశ్యాన్ని గుర్తు చేసుకోవచ్చు. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పినా నువ్వు చంపుతావు. చెప్పకపోయినా చంపుతావు. నా చావు నాకు తెలుస్తోంది. ఇవాళ నా డెత్ డే. రేపు నీ డెత్ డే అంటూ నాజర్ పాత్ర చెబుతుంది. ఇందుకు విలన్ పాత్రలో ఉన్న ప్రశాష్ రాజ్ బెస్టాఫ్ లక్ చెబుతాడు. అచ్చం అలా కాకపోయినా చావు గురించి ముందే తెలుసుకుంటాడు పరిటాల రవి. చనిపోయేటప్పుడు అదే మాట చెబుతాడు. చంపడం తప్ప నువ్వేం చేయలేవని సైగ చేస్తూ ప్రాణాలొదిలాడంటారు. ఇప్పటికీ ఆ మాటలే చెబుతారు అక్కడున్న వాళ్లు.

ఏం జరిగిందంటే….

అది జనవరి 24, 2005. మధ్యాహ్నాం 2.10 నిమిషాలు. అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బయటకు వచ్చాడు పరిటాల రవీంద్ర. ఇద్దరు గన్ మెన్లు ఉన్నారు. అంతే రవిపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసింది. మోకాళ్లలో రెండు, ఛాతిలో రెండు, పక్కటెముకల్లో రెండు. చివరిగా గుండెలో ఒకటి. ఏం జరుగుతుందో ఆలోచించే లోపే ఏడు బుల్లెట్లు. పరిటాల శరీరాన్ని చిద్రం చేశాయి. రక్తం ధారలా కారింది. నన్ను చంపబోతున్నావని తెలుసు. పిరికి పందా..నన్ను చంపుతున్నావా అంతే కదా..అవే ఆయన ఆఖరి మాటలని అభిమానులు చెప్పుకునే మాట.

పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించాడు పరిటాల రవి. అందుకే అన్న ఎన్టీఆర్ పిలిచి మరీ ఆయనకు టీడీపీ టిక్కెట్ ఇచ్చారంటారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అదే స్థాయిలో గౌరవించారు. పరిటాల రవి చనిపోయి చాలా కాలమే అయింది. అయినా ఆయనకు అనుకూలంగానో వ్యతిరేకంగానో ప్రజల నోళ్లల్లో నానుతూనే ఉన్నాడు. ఎప్పటికీ అదే పరిస్థితి ఉంటుంది. రాయలసీమ చరిత్ర ఉన్నంత వరకు పరిటాల రవిని మర్చిపోలేరని ఆయన అభిమానులు చెప్పే మాట.

పార్టీలో సాధారణ కార్యకర్తగా అడుగుపెట్టి పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కుడి భుజంగా మెసిలాడు. విముక్త రాయలసీమ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించాడు. అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశాడు పరిటాల రవి. ఆయన తన జీవితమంతా ఫ్యాక్షన్ మీద రాజీ లేని పోరు సాగించాడు. జీవితానికీ మరణానికీ సార్ధకత ఉండాలని తపించిన వ్యక్తి. మార్పు జీవితమంత విశాలమైనది అని చెప్పిన నేత. ఫ్యాక్షనిజం మానవజాతిని రెండు పరస్పర వ్యతిరేక వర్గాలుగా విభజించే దిశగా వెళితే, నేను సామాన్యులుండే వర్గం తరపునే నిలుస్తానని ప్రకటించిన నేత. పరిటాల రవి జీవితమంతా ఫ్యాక్షన్ సామ్రాజ్యవాద శక్తులతో జరిపిన పోరాటాలమయమే. తెలుగుదేశం పార్టీ విజయానంతరం లభించిన మంత్రి పదవిని వద్దనుకున్నాడు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలకు విముక్తి కలిగించాలని అనుకున్నాడు.

మనిషి. ఎందుకలా ప్రవర్తించాడు. ఇతనికేం కావాలి. సుఖమైన జీవితాన్ని వొదిలిపెట్టి ఎందుకలా ప్రాణాలకు తెగించి పోరాడాడు. ఒక మనిషిని శృంఖలాలనుంచి విముక్తుడిని చేయటానికి మరో మనిషిపై తుపాకి గురిపెట్టాలా..అని తన డైరీలో రాసుకున్నాడు పరిటాల రవి. నిబద్దత, రాజకీయ అవగాహన, పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించాలన్న కాంక్ష ప్రతీ పేజీలోనూ కనిపిస్తాయి. మార్పు తీసుకురావటానికి పరిటాల రవి ఎంచుకొన్న విధానం హింసాపూరితం కావొచ్చు. కానీ ఇతని నిజాయితీని శంకించలేమనేది సీమ వాసుల వాదన.

పరిటాల చరిత్రను…

రవి తండ్రి పేరు పరిటాల శ్రీరాములు. ఆయన్ని పోరాటాల శ్రీరాములు అని కూడా పిలుస్తుంటారు. శ్రీరాములు తండ్రి ధర్మవరపు చిన ముత్యాలప్పకి స్వయాన మేనల్లుడు. ఈ చిన ముత్యాలప్ప అనంత సీమలో కమ్యూనిస్ట్ పార్టీకి పునాదులు వేశాడు. 1952లో శ్రీ రాములు సీరిపి కొట్టాల గ్రామానికి చెందిన రాసినేని పెద నారాయణప్ప చెల్లెలు నారాయణమ్మని వివాహం చేసుకున్నాడు. 1948-51 హయాంలో కమ్యుూనిస్టు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నాడు. వందల ఎకరాల భూమిని ప్రజలకు పంచడంలో కీలకమైన పాత్ర పోషించి వ్యక్తి. 1959 సెప్టెంబర్ 4 న రామసుబ్బారెడ్డి అనే భూస్వామిపై దాడి జరిగింది. ఈ దాడిలో రామ సుబ్బారెడ్డితో పాటు…తలారి నరసింహులు చనిపోయారు. అప్పుడు తీవ్ర గాయాల పాలైన రామసుబ్బారెడ్డి నాలుగు రోజుల తర్వాత చనిపోయాడు. ఈ హత్యలో పాత్ర ఉందంటూ శ్రీరాములకు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 1962లో ఆ కేసును కొట్టేశారు. ఫలితంగా అందరూ విడుదలై బయటకు వచ్చారు. శ్రీ రాములు సోదరుడు గజ్జెలప్పకు శిక్ష పడింది.

పరిటాల బయటకు వచ్చాక భారత్- చైనాయుద్దం జరిగింది. అప్పుడే భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలింది. సిపిఐ నుంచి వేరు పడిన వారు 1964లో సిపిఎంగా ఏర్పడ్డారు. అప్పుడే నసనకోట పంచాయితీకి సర్పంచిగా పోటీ చేశాడు. కానీ ముత్యాలప్ప అనే వ్యక్తి కొందరు భూస్వాములతో చేతులు కలిపి ఆ ఎన్నికల్లో గెలుస్తాడు. అదే సమయంలో మద్దుల చెరువుకి చెందిన గంగుల నారాయణ రెడ్డి అతని అనుచరుడు సానె చెన్నారెడ్డిల హవా సాగుతోంది. వారి నుంచి తమను రక్షించాలని శ్రీరాములుని ఆశ్రయించారు స్థానికులు. ఫలితంగా పెనుబోలు గ్రామంలో భూస్వాములకి అడ్డు తగిలారు శ్రీరాములు.

అది వారికి కంటగింపు అయిందంటారు. ఫలితంగా శ్రీ రాములు ప్రధాన శత్రువు అయ్యాడు. అందుకే పొలంలోనే శ్రీరాములను హతమార్చేందుకు ప్రయత్నించారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. కానీ చాకచక్యంగా తప్పించుకుంటాడు శ్రీరాములు. విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితుడైనా పరిటాల కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. ఫలితంగా అక్కడ వామపక్షాలకు బలమైన పునాదులు ఏర్పడ్డాయి. సామాన్యులు సైతం ఆయుధాలు పట్టి భూస్వాముల పై తిరగ బడ్డారు. శ్రీ రాములుని చంపితేనే మనకు మేలని వైరి వర్గం నిర్ణయించుకుంది. తొలిగా శ్రీరాములు ప్రధాన అనుచరుడైన వెట్టి ముత్యాలప్ప పై దాడి జరిగింది. తప్పించుకున్నాడు. శ్రీ రాములు నేతృత్వంలో భూస్వామి అయిన వెంకట రెడ్డిని ఈడ్చుకుని వచ్చారనే వాదనుంది. తనను చంపవద్దని వేడుకోవడంతో పాటు శ్రీరాములు కాళ్ల మీద పడి క్షమాపణ అడగడంతో వదిలేసారంటారు. ఇదే అసలు హత్యకు దారి తీసింది. 1975లో శ్రీరాములు అనుచరుడైన సిద్దప్పని వశ పరచుకుని పెళ్లికి వెళ్లి వస్తున్న బస్సు పై దాడి చేసారు. ఈ దాడి లో శ్రీ రాములు, అతని తమ్ముడు సుబ్బయ్య , తగర కుంటకి చెందిన రామాంజనేయులు, ఎగువపల్లికి చెందిన లింగన్న చనిపోయారు. నారాయణమ్మ ఈ సమయం లో కూడా తెగువ చూపించి వీరిపై తిరగ బడిందని చెబుతారు.

తండ్రిబాటలోనే కొడుకు

ఈ సమయంలో పరిటాల రవి వయసు కేవలం 17 ఏళ్లు. ఆ తర్వాత శ్రీరాములుకి మద్దతుగా నిల్చిన వారి పై ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో శ్రీరాములు పెద్ద కొడుకు హరి వచ్చాడు. కొంతకాలం ఉద్యమాన్ని నడిపాడు. ఉద్యమ నాయకుడైన సత్యంని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ప్రభుత్వం. కానీ హరి వందల మందితో వచ్చి పోలీస్ స్టేషన్ లో చొరబడి చాకచక్యం గా తప్పించేశాడనే ఆరోపణలున్నాయి. హరిని పట్టుకుంటేనే హింస ఆగుతుందని ప్రభుత్వం భావించింది. అందుకే 1982 నవంబర్ 28 న ఎన్ కౌంటర్ చేసిందని చెబుతారు. పోలీసులు, నక్సల్స్ మధ్య కాల్పులు జరిగాయి. ఆ సంఘటనలో హరి చనిపోయాడని రికార్డులు చెబుతున్నాయి.

1958 ఆగస్ట్ 30న జన్మించాడు పరిటాల రవి. తండ్రి శ్రీరాములు హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగుల నారాయణ రెడ్డిని 1983లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పరిటాల రవినే చంపాడని కొంతమంది. కాదు కాదు పీపుల్స్ వార్ పార్టీ చంపిందని మరికొందరు చెప్పారు. వాస్తవం ఏంటనేది పక్కన పెడితే పుకార్లు బాగా షికారు చేశాయి. 1983 ఎన్నికల్లో గెలిచి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1984 లో రవి తన స్వగ్రామానికి వెళ్ళారు. అదే ఏడాది అక్టోబర్ 27న ధర్మవరపు కొండన్న కూతురు సునీతతో రవి వివాహం జరిగింది. శ్రీరాములు హత్య తో సంబంధమున్న సిద్దప్ప 1986 లో జైలు నుంచి విడుదలయ్యాడు. కాని అతన్ని పీపుల్స్ వార్ చంపేసింది. పరిటాలనే ఈ హత్యకు కారణమనే చర్చ వచ్చింది. ఫలితంగా రవిని అరెస్ట్ చేసారు. కొంతకాలానికి మళ్లీ స్వగ్రామమైన వెంకటాపురంకి వచ్చాడు రవి. ఆ తర్వాత ప్రత్యేక రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడు. క్రమంగా గట్టి నేతగా ఎదిగాడు. అప్పుడు రాష్ట్రంలో జరిగిన తొలి మండల ఎన్నికల్లో రామగిరికి దళిత కులానికి చెందిన ఓబన్న…పరిటాల రవి మద్దతుతో గెలిచాడు. శ్రీ రాములు, హరిల హత్యలతో సంబంధముని ఆరోపణలు ఎదుర్కున్న సానె చెన్నారెడ్డి పెనుగొండ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. భారీ బందోబస్తు తో ప్రచారానికి వచ్చిన అతన్ని రవి అడ్డుకున్నాడంటారు. ఏడు ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. స్థానిక నేత చెన్నారెడ్డి తిరిగి గెలిచాడు. తాను పదవిలోకి రాగానే తనకి వ్యతిరేకుల సంగతి ఏం చేయాలా అని ఆలోచించాడు. రవి మద్దతు దారుల పై పెద్ద ఎత్తున దాడులు చేయించారంటారు. ఫలితంగా చాలా మంది బలయ్యారనే ఆరోపణలున్నాయి. కుంటి మద్ది , ఏడు గుర్రాల పల్లి , గాదిగ గుంటలలో ఎక్కువగా మారణ హోమాలు జరిగాయి. అనేక కుటుంబాలు పల్లెల నుండి వెళ్లి పోయాయి. కానీ 1991 మే7 న చెన్నారెడ్డిని పీపుల్స్ పార్టీ కాల్చి చంపిందంటారు. దాంతో చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవి ఊరికి దగ్గర గా ఉన్న కొత్త గాదిగకుంట పై దాడి చేశారనే చర్చ ఉంది. ఊరిలోని ఇళ్లకు వారు నిప్పు పెట్టారంటారు. ఫలితంగా చాలా ఇళ్లు మాడి మసై పోయాయని చెబుతారు. వెంకటాపురం నుండి రవి మనుషులు భారీ ఎత్తున వెళ్లి వాళ్ళని తరిమికొట్టారని చెప్పుకుంటారు.

రాజకీయ చరిత్ర…

మరోవైపు పెనుగొండలో చెన్నారెడ్డి పెద్ద కొడుకు రమణా రెడ్డి ఎమ్మల్యేగా గెలిచాడు. రమణా రెడ్డి తమ్ముడు ఓబుల్ రెడ్డి, ఆయన కుమారులు సూర్య నారాయణ రెడ్డి ( సూరి ), రఘునాధ రెడ్డిలు ఆయనకు అండగా ఉంటూ వచ్చారు. స్థానికంగా వారికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు పరిటాల రవి. అదే సమయంలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని రవి భావించాడు. అందుకే అప్పటి జిల్లా ఎస్పీ కే.వి రెడ్డి సమక్షంలో పోలీసుల వద్ద 1992లో లొంగిపోయాడు. అప్పటి నుండే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు రవి. మాజీ నక్సలైటు ముష్కిన్ షేక్ రవికి సన్నిహితుడు. ఓబుల్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపాడు. ఫలితంగా 1993లో ముస్కిన్ ను వైరి వర్గం దారుణంగా చంపింది. ఆ తర్వాత 1993 అక్టోబర్ 24 న రవి వర్గీయులు తన ప్రత్యర్థులను చంపేందుకు ప్రణాళిక సిద్దం చేశారంటారు. మరమ్మత్తులకు ఇచ్చిన టీవీలో బాంబు పెట్టి సూరి కుటుంబాన్ని హతమార్చేందుకు సినీపక్కీలో కుట్ర జరిగింది. మద్దెల చెరువు సూరి ఇంటిలో ఇది పేలింది. ఈ ఘటనలో సూరి తల్లి సారమ్మ, తమ్ముడు రఘునాథరెడ్డి, అక్క పద్మలతోపాటు బోయ చంద్రశేఖర్‌, నారయణప్పలు మృతిచెందారు. వారి కుటుంబంలో మిగిలింది సూరి ఒక్కరే. ఫలితంగా రఘునాధ రెడ్డి ( సూరి తమ్ముడు ) తో పాటు ఆరు మంది చనిపోయారు. ఇది రవి పనే అని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 1994 జూన్ 17 న వై.ఎస్ రాజా రెడ్డిని ( వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి ) రవి కలిసాడు. ఇది కాంగ్రెస్ లో పెద్ద గొడవకు దారి తీసింది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పటికీ రహస్యమే. కానీ అదే ఏడాది ఆగస్ట్ 7 న పెనుకొండలో జంట హత్య లు జరిగాయి. రమణా రెడ్డి అనుచరుల్ని గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. మొదటి ముద్దాయిగా రవి ఉండటంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ లోపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. జైలు నుండే నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు రవి. అత్యధిక మెజారిటీ తో గెలిచారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. పరిటాల కార్మిక మంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత హత్యా రాజకీయాల్ని పక్కన పెట్టి ఫ్యాక్షన్ కుటుంబాల మద్య రాజీ కుదిర్చి గొడవల్ని తగ్గించే పని చేశాడు పరిటాల రవి.

ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 1996 లో ఓబులరెడ్డి హత్య జరిగింది. తన తండ్రి జీవితాన్ని సినిమాగా తీద్దామనుకున్న రవి 1997 లో రాములయ్య సినిమా నిర్మాణం చేయించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కారులో బాంబు పేలడంతో సినీ నటుడు మోహన్ బాబుకి బాగా దెబ్బలు తగిలాయి. కాని రవి క్షేమంగా బయట పడ్డాడు. అందులో 26 మంది అమాయకులు చనిపోయారు. ఇది సూరి పనే అని అంతా భావించారు. ఈ కేసు పై విచారించిన కోర్టు సూరికి యావజ్జీవ శిక్ష వేసింది. 2001 లో రవికి తీవ్రమైన జ్వరం వచ్చి చాలా రోజుల పాటు మంచాన పడ్డాడు. 2003 లో రాయల కాలం నాటి దేవాలయాన్ని పునరుద్దరించి 550 మంది జంటలకి పెళ్ళిళ్ళు చేశాడు రవి. 2004 ఫిబ్రవరి లోనూ 1116 పెళ్ళిళ్ళు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సూరి భార్య గంగుల భానుమతిని కాంగ్రెస్ అభ్యర్ది గా నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం ఓడి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. రవికి ప్రాణ హాని మొదలైంది. ముందు జాగ్రత్తగా తన ప్రధాన అనుచరుడైన చమన్ ( రవి కుడి భుజం ) అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. రవి పై ఉన్న పాత కేసులని తిరగదోడటం మొదలైంది. ఆ సమయంలోనే తనకు ప్రాణ హాని ఉందని ప్రభుత్వానికి పదే పదే చెప్పాడు రవి. గన్ మెన్ ల సంఖ్యను నాలుగు నుంచి రెండు కి తగ్గించేసారు. కానీ ఫలితం లేదు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న సూరికి తన వైరి వర్గానికి మధ్య సంభాషణ జరిగినట్లుగా చెప్పాడు రవి. కానీ ఇది నిరూపణ కాలేదు. ఆ విషయంలో రవి పై పరువునష్టం దావా కూడా వేశారు. ఫలితంగా 2004 డిసెంబర్ 23 న పులివెందులలో కోర్టుకి హాజరయ్యాడు. తన ఆరోపణలకి సంబందించిన సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పాడు. కానీ ఈ లోపే 2004 సెప్టెంబర్ 7 న ప్రభాకర్ (రవి అనుచరుడు) హత్య జరిగింది. అప్పుడే రవి మానసికంగా అన్నిటికీ సిద్దపడ్డాడంటారు. చివరకు పరిటాల రవిని ప్రత్యర్థులు హతమార్చారు.

సూరి…మొద్దు శీనుల హత్య…

సూరి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే 2005 జనవరి 25వ తేదీన పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు. సూరి బావ కళ్లలో ఆనందం చూసేందుకే తాను ఈ హత్య చేశానని జూలకంటి రంగారెడ్డి అలియాస్‌ మొద్దుశీను ప్రకటించాడు. ఓ టీవీ చానల్ తో ఈ మాట చెప్పడం సంచలనంగా మారింది. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ, మద్దెలచెరువు సూరిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. దీంతో ఈ కేసు విచారణ అనంతపురం జిల్లా కోర్టులో జరిగింది. కారుబాంబు కేసుకు సంబంధించి 2009లో సూరికి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. అయితే పరిటాల హత్యకు సంబంధించిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో కొంతకాలం రిమాండులో ఉండాల్సి వచ్చింది. 2009 డిసెంబరు 12న కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రవి హత్య కేసు నిందితుడు మొద్దు శీను అనంతపురం జిల్లా జైలులోనే హత్యకు గురయ్యాడు. 2008 నవంబర్ 9వ తేదీన కారాగారంలోనే ఈ సంఘటన జరిగింది. తాను రామకోటి రాసుకుంటూ ఉండగా మొద్దుశీను తనను ఇబ్బంది పెట్టాడని దాంతో కోపమొచ్చి తాను అతన్ని డంబుల్ తీసుకొని చంపినట్టు చెప్పారు ఓం ప్రకాష్‌ అనే తోటి ఖైదీ. మరోవైపు మద్దెల చెరువు సూరిని భాను కిరణ్ హతమార్చారనే ఆరోపణలు వచ్చాయి. కారులో వెనుక కూర్చున్న భాను కిరణ్ అతన్ని చంపేశారనే ఆరోపణలొచ్చాయి. పరిటాల రవి హత్యకేసులో కీలకమైన సూరి, రేఖమయ్యలకు భాను కిరణ్ సహకరించాడనే ప్రచారం జరిగింది. రవి హత్యకు ముందు మొద్దు శీను, రేఖమయ్యకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, గన్స్, వాటి రౌండ్లు భానూయే సమకూర్చాడనే వాదన వచ్చింది. తమిళనాడు నుంచి మరో నలుగురిని తీసుకొచ్చారని చెప్పారు. తాను ఆ పని చేయలేదని భాను కిరణ్ చాలా సార్లు చెప్పాడు.

పరిటాల కేసులో శిక్ష

మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులోని నిందితులలో ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించింది కోర్టు. మొత్తం పదహారు మందిలో ఎనిమిది మంది దోషులుగా తేలారు. అందులో నలుగురిపై కేసు కొట్టేసింది. సరైన ఆధారాలు లేనందున పటోళ్ల గోవర్దన్ రెడ్డి, జివి రెడ్డి, ఆనంద కుమార్ రెడ్డి, రామస్వామిలను విడిచి పెట్టింది. మరో నిందితుడు రామ్మోహన్ రెడ్డి అప్రూవర్‌గా మారాడు. ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో మరో ముగ్గురు ప్రధాన నిందితులు మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు హత్యకు గురయ్యారు. మిగిలిన ఎనిమిది మందిని దోషులుగా నిర్దారిస్తూ తీర్పు వచ్చిది. వారిలో వడ్డె కొండ, వడ్డె శీను, రేఖమయ్య, నారాయణ రెడ్డి, రంగనాయకులు, పెద్దిరెడ్డి, హన్మంత రెడ్డి, ఓబిరెడ్డి లకు జీవిత ఖైదు విధించింది. పరిటాల రవి హత్య కేసులో 133 మంది సాక్షులను కోర్టు విచారించింది. పరిటాల రవి మన ముందు లేనప్పటికీ పెనుగొండ, రాప్తాడు ప్రాంతాలు శాంతియుతం కావాలని ఆయన భార్య సునీత, కుమారుడు పరిటాల శ్రీరామ్ లు కోరుతున్నారు. పరిటాల కుటుంబంలో మూడో తరం నేత శ్రీరామ్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం చర్చనీయాంశమైంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో