చిలిపి కృష్ణునికి ప్రసాదాలు : ఒక్క తులసే చాలదా?

Krishnastami celebrations Interesting facts about Lord Krishna, చిలిపి కృష్ణునికి ప్రసాదాలు : ఒక్క తులసే చాలదా?

“బృందావనమాలి..రరా మా ఇంటికి ఒకసారి’..అంటూ యావత్‌ భారతవని ఆ నల్లన్నయ్యను ప్రేమగా ఆహ్వనించే శుభఘడియ శ్రీ కృష్ణాష్టమి..శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో జన్మించిన ఆ నందనందనుడి జన్మదిన వేడుకలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కన్నయ్య జన్మదినమంటే జగమంతా వేడుకే.  ప్రతి ఇంట్లోనూ కృష్ణుడు పుట్టిన రోజును తమ ఇంటిబిడ్డ పుట్టిన రోజుగానే చేసుకుంటారు. బుడిబుడి అడుగుల చిన్ని కృష్ణుడు తమ గడపలో కాళు పెడుతున్నట్లుగా ముగ్గులతో ఆహ్వానిస్తారు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా ..ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే..మన ఇంట్లో మనిషి పుట్టిన రోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం..ఇంతకీ ఆ రోజు కృష్ణునికి ఎటువంటి నైవేద్యం పెడతారు..ఎలా పూజిస్తారో చూద్దామా..!చిలిపి కృష్ణుడు..అందరివాడు కాబట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పూజిస్తారు..ప్రాంతాల వారిగా ఆయనకు ప్రసాదాలు, నైవేద్యాలు సమర్పిస్తారు..పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపి తయారు చేసిన పంచామృతంతో ముందుగా కృష్ణుడికి అభిషేకం చేస్తారు. అనంతరం పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు.

కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో తులసీని తప్పక వాడాలని చెబుతారు.. ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిదట. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమేనట..! కృష్ణాష్టకమ్‌, కృష్ణ అష్టోత్తరం వంటి స్త్రోత్రాలను చదువుతూ, పరిమళభరితమైన పుష్పాలతో ఆయనకు అర్చన జరిపితే కృష్ణుడు తప్పక మీ ఇంటనే కొలువై ఉంటాడట !వేయించిన మినపపిండి పంచదార వాము, ధనియాల పొడి కలిపిన మిశ్రమాన్నిదేవకికి నివేదించాలి.పాలు, వెన్నశ్రీ కృష్ణ పరమాత్ముడికి ప్రీతికరమైన నైవేద్యం. శోంఠి మిరియం బెల్లం ప్రత్యేకంగా ఆరగింపు చేయాలి. ఇక ప్రాంతాలను బట్టి వారివారి అభిరుచులను బట్టి భక్తులు శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పిస్తారు. కొందరు పంచామృతం, మరికొందరు ఆలూ పూరి, హల్వా, పెడితే..అటూ బెంగాలీలు కృష్ణుడికి “మోహన్‌భోగ్‌’ సమర్పిస్తారు..ఇందులో మొత్తం 56 రకాల వంటకాలు ఉంటాయి. మరికొందరు సబుదానా ఖీర్‌ను నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెడతారు. ఉపవాసనాంతరం వారు కూడా అదే ప్రసాదాన్ని సేవిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *