IPL 2020: ముంబై vs చెన్నై: ధోనిపై రోహిత్‌దే పైచేయి..!

|

Sep 19, 2020 | 3:08 PM

కట్టప్పా సమర శంఖం పూరించు.. ఐపీఎల్ 13వ సీజన్ మరికొద్ది గంటల్లో మొదలు కానుంది. బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతుండటంతో అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టేశారు.

IPL 2020: ముంబై vs చెన్నై: ధోనిపై రోహిత్‌దే పైచేయి..!
Follow us on

కట్టప్పా సమర శంఖం పూరించు.. ఐపీఎల్ 13వ సీజన్ మరికొద్ది గంటల్లో మొదలు కానుంది. బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతుండటంతో అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టేశారు. కరోనా నేపథ్యంలో ఆరు నెలలుగా ఎంటర్టైన్మెంట్‌కు దూరమైన క్రికెట్ ఫ్యాన్స్.. ఈ టోర్నీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలబడనున్నాయి. (IPL 2020)

ఐపీఎల్ చరిత్రలో ఈ రెండూ అత్యంత విజయవంతమైన జట్లు.. అయితే మునపటి గణాంకాలు ఒకసారి చూసుకుంటే చెన్నైపై ముంబైదే పైచేయిగా ఉంది. ఐపీఎల్‌లో ముంబై నాలుగు సార్లు ట్రోఫీ అందుకోగా.. ధోనిసేన మూడు సార్లు కప్ దక్కించుకుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 28 సార్లు తలబడ్డాయి. ఇందులో ముంబై 17, చెన్నై 11 సార్లు విజయం అందుకుంది. ఈ ఏడాది ముంబై, చెన్నైలకు స్టార్ ప్లేయర్లు మలింగా, హర్భజన్, సురేష్ రైనాలు దూరమైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే లీగ్‌లో తొలి మ్యాచ్‌కు అబుదాబిలోని షేక్‌ జయేద్‌ స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ ముంబై సొంత మైదానం. ఎప్పుడూ పొడిగా ఉండే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు సాధ్యం కావు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ కేవలం 140 పరుగులు మాత్రమే. ఈ గ్రౌండ్ కూడా పెద్దది కావడంతో సిక్సర్లు బాదడం తక్కువ.

ముంబై, చెన్నై జట్లకు సారథులే బలం. ధోని, రోహిత్ కెప్టెన్సీ దాదాపు ఒకేలా ఉంటుంది. ఇక ఈ విషయాన్ని కూడా సీనియర్ ఆటగాళ్లు అంతకముందు చెప్పకనే చెప్పారు. మిస్టర్ కూల్ నాయకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రోహిత్ శర్మ కూడా తక్కువోడేం కాదు. డికాక్‌, రోహిత్‌, క్రిస్‌లిన్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యాలతో ముంబై బ్యాటింగ్ అత్యంత భీకరంగా ఉంటే.. చెన్నై బ్యాటింగ్ లైనప్‌పై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా ఆ జట్టు రాయుడు, వాట్సన్‌, ధోనీ, మురళీ విజయ్, డుప్లెసిస్‌లపై ఆధారపడాల్సి ఉంది. అటు బౌలింగ్ లోనూ ఇరు జట్లు సమవుజ్జీలే. జడ్డూ, పియూష్‌, తాహిర్‌, కేదార్‌, శాంట్నర్‌, కర్ణశర్మ, హేజిల్‌వుడ్‌, బ్రావో, చాహర్‌, ఎంగిడిలతో చెన్నై బౌలింగ్ విభాగం బలంగా ఉండగా.. బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్, ధవళ్ కులకర్ణి, నేథన్‌ కౌల్టర్‌నైల్‌, ప్యాటిన్‌సన్‌, పాండ్యా బ్రదర్స్, రాహుల్ చాహర్ లాంటి బౌలర్లు ముంబై జట్టుకు ఉన్నారు. మరి వీరిద్దరిలో ఎవరిది ఫస్ట్ పంచ్ పడుతుందో చూడాలి.

చెన్నై(అంచనా): షేన్ ‌వాట్సన్‌, అంబటి రాయుడు, డుప్లెసిస్‌, ఎంఎస్‌ ధోనీ (కె), కేదార్‌ జాదవ్‌, డ్వేన్‌బ్రావో, రవీంద్ర జడేజా, పియూష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

ముంబై(అంచనా): రోహిత్‌ శర్మ (కె), క్వింటన్‌ డికాక్‌ , సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, నేథన్‌ కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా