మీ ఇంటికి లక్ష్మీ కటాక్షాన్ని అందించే ఈ మొక్క పూలు పూయడం లేదా? ఈ చిట్కాలతో మొగ్గలు రావడం ఖాయం!

బ్రహ్మ కమలం.. రాత్రిపూట వికసించే ఈ సువాసనగల పువ్వును చూడటం ఏ ప్రకృతి ప్రేమికుడికైనా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. కానీ, సంవత్సరాల తరబడి వేచి చూసినా మొక్కకు ఒక్క మొగ్గ గానీ, పువ్వు గానీ పూయకపోతే, అది చాలా నిరాశ కలిగిస్తుంది. నిజానికి, బ్రహ్మ కమలం మొక్కకు సరైన సంరక్షణ, సరైన నేల, పోషకాలు అందడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీ వంటగదిలోని కొన్ని సాధారణ పదార్థాలను మట్టిలో కలపడం ద్వారా, మీరు ఈ మొక్కను మళ్లీ పూయించవచ్చు... దీని కోసం ఖచ్చితంగా ఏం చేయాలో చూద్దాం.

మీ ఇంటికి లక్ష్మీ కటాక్షాన్ని అందించే ఈ మొక్క పూలు పూయడం లేదా? ఈ చిట్కాలతో మొగ్గలు రావడం ఖాయం!
Brahma Kamal Plant

Updated on: Apr 17, 2026 | 9:38 AM

Brahma Kamalam Flower: బ్రహ్మ కమలం పువ్వు, సంవత్సరానికి ఒకసారి రాత్రిపూట మాత్రమే వికసించే అరుదైన పువ్వు. ఇది అర్ధరాత్రి వికసించి ఉదయం రాలిపోయే అద్భుతమైన పుష్పం. దీనిని ప్రేమగా రాత్రుల రాణి అని కూడా పిలుస్తారు. చాలా మంది తమ పెరట్లో, బాల్కనీలో ఈ బ్రహ్మ కమలం మొక్కను ఇష్టంగా పెంచుతుంటారు. దాని అందమైన, అరుదైన పువ్వు వికసించడాన్ని చూడటం ఒక ప్రత్యేక అనుభూతి. కానీ, చాలా మంది ఇళ్లల్లో మొక్క బాగా పెరిగి, ఆకులు పచ్చగా ఉన్నప్పటికీ, దానికి మొగ్గలు గానీ, పువ్వులు గానీ పూయవు. నెలలు, సంవత్సరాలు ఎదురు చూసిన వారికి అసలు సమస్య ఏంటో తెలియక సతమతమవుతుంటారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారా..? అయితే, ఇది మీ కోసమే..మీ ఇంట్లోని బ్రహ్మ కమలం మొక్క త్వరగా పూయడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం…

బ్రహ్మకమలం కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. అందుకే ఈ బ్రహ్మకమలం మొక్కను ఇంట్లో పెంచుకోవడం అదృష్టంగా భావిస్తారు. ఇది సాధారణంగా ఏడాదికి ఒకసారి మాత్రమే రాత్రి పూట పూస్తుంది. అయితే, చాలామందికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే, మొక్క పెరుగుతుంది. కానీ, పూలు పూయదు. బ్రహ్మకమలం త్వరగా పూయడానికి, మొక్క ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన గార్డెనింగ్ టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

బ్రహ్మకమలం ఒక సక్యూలెంట్ (Succulent) జాతి మొక్క. దీనికి ప్రకాశవంతమైన వెలుతురు అవసరం, కానీ, మధ్యాహ్నం వేళల్లో వచ్చే తీవ్రమైన ఎండ దీని ఆకులను కాల్చివేస్తుంది. కాబట్టి, ఉదయం ఎండ తగిలే చోట లేదా గాలి, వెలుతురు బాగా వచ్చే బాల్కనీలో దీనిని ఉంచాలి. దీని ఆకుల్లో నీరు నిల్వ ఉంటుంది. కాబట్టి దీనికి రోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. కుండీలోని పై మట్టి పూర్తిగా ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది.

బ్రహ్మకమలం మొక్క వేర్లు కుండీలో కిక్కిరిసి (Root bound) ఉన్నప్పుడే ఎక్కువ పూలు పూస్తుంది. అందుకే, మొక్క పరిమాణానికి తగ్గట్టుగా కుండీ ఉండాలి. మరీ పెద్ద కుండీలో వేస్తే మొక్క కేవలం ఆకులను మాత్రమే పెంచుతుంది, పూలపై దృష్టి పెట్టదు. మొక్క ఎదుగుదలకు నెలకు ఒకసారి వర్మీ కంపోస్ట్ లేదా బాగా చివికిన పశువుల ఎరువును అందించాలి. పూలు పూసే సమయం వర్షాకాలానికి ముందు పొటాషియం అధికంగా ఉండే అరటిపండు తొక్కల ఎరువును ఇస్తే మొగ్గలు త్వరగా వస్తాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ బ్రహ్మకమలం ఒక ఆకు ద్వారా కూడా కొత్త మొక్కను ఉత్పత్తి చేయగలదు. ఒక ఆరోగ్యకరమైన ఆకును కట్ చేసి ఇసుక కలిపిన మట్టిలో నాటితే కొద్ది రోజుల్లోనే కొత్త వేర్లు వస్తాయి. బ్రహ్మకమలం రాత్రిపూట పూసి, అద్భుతమైన సువాసనను వెదజల్లుతుంది. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే, మీ ఇంట్లోని బ్రహ్మకమలం కూడా త్వరలోనే పూసి మీ ఇంటికి ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని తీసుకువస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us