
మనం అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రాసిచ్చే ప్రిస్క్రిప్షన్ చూసి చాలాసార్లు తల గీక్కుంటాం. ఆ గజిబిజి రాతలో మందు పేరు ఏంటో, అది ఎలా వాడాలో సామాన్యులకు అస్సలు అర్థం కాదు. కానీ అదే కాగితాన్ని మెడికల్ షాపులో ఇస్తే.. వారు క్షణాల్లో చదివేసి కరెక్ట్ మందులు తీసి ఇస్తారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఆ గజిబిజి రాతల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వైద్యులు కాకపోయినా మెడికల్ షాపు సిబ్బందికి ఆ రాతలు అర్థం కావడానికి ప్రధానంగా అనుభవం కారణం. ఒక ప్రాంతంలోని మెడికల్ షాపు సిబ్బందికి అక్కడి డాక్టర్లు రెగ్యులర్‌గా ఎలాంటి మందులు రాస్తారో అవగాహన ఉంటుంది. ప్రతి డాక్టర్‌కు ఒక ప్రత్యేకమైన హ్యాండ్‌రైటింగ్ ప్యాటర్న్ ఉంటుంది దానిని ఫార్మసిస్ట్‌లు సులభంగా గుర్తుపడతారు. మందు పేరులో మొదటి రెండు అక్షరాలు, చివరి అక్షరం చూసి, అది ఏ వ్యాధికి సంబంధించిన మందో వారు ఇట్టే కనిపెట్టేస్తారు. ఒకవేళ రాత అస్సలు అర్థం కాకపోతే.. “ఈ మందు ఎవరికి? సమస్య ఏంటి?” అని కస్టమర్‌ని అడుగుతారు. ఆ సమాచారం ఆధారంగా ప్రిస్క్రిప్షన్‌లోని మందును నిర్ధారించుకుంటారు.
డాక్టర్ల రాత గజిబిజిగా ఉండటానికి కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. వందలాది మంది రోగులను చూడటం వల్ల వేగంగా రాయాల్సి రావడం. రోజంతా ఒకే రకమైన మందుల పేర్లు రాస్తూ ఉండటం వల్ల రాతలో స్పష్టత తగ్గుతుంది. కొన్నిసార్లు సమీపంలోని మెడికల్ షాపులతో ఉండే కమిషన్ ఒప్పందాల వల్ల కేవలం వారికి మాత్రమే అర్థమయ్యేలా కోడ్ భాషలో రాస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి రోగికి ఆరోగ్య హక్కు ఉంది. మందుల గురించి తెలుసుకునే హక్కు కూడా అందులో భాగమే. ఒక చిన్న తప్పు రాత ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. అందుకే డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ అందరికీ అర్థమయ్యేలా ఉండటం అత్యవసరం.