AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాకిస్తాన్ అని ఆ దేశానికి పేరు పెట్టింది ఎవరో తెలుసా..? బాబోయ్ ఇంత కథ ఉందా..

పాకిస్తాన్.. ఈ పేరు వినగానే మనకు దేశ విభజన గుర్తుకొస్తుంది. కానీ ఈ పేరు ఒక సంక్షిప్త రూపం అని మీకు తెలుసా? లండన్ రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒక విద్యార్థికి వచ్చిన ఈ ఆలోచన, ఒక దేశానికే పేరుగా ఎలా మారింది? పర్షియన్ భాషలో పాక్ అంటే ఉన్న అర్థం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Pakistan: పాకిస్తాన్ అని ఆ దేశానికి పేరు పెట్టింది ఎవరో తెలుసా..? బాబోయ్ ఇంత కథ ఉందా..
Who Named Pakistan
Krishna S
|

Updated on: Feb 05, 2026 | 10:44 AM

Share

నేడు ప్రపంచపటంలో ఒక ప్రత్యేక దేశంగా ఉన్న పాకిస్తాన్ పేరు వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. ఈ పేరు ఏదో అనుకోకుండా పెట్టింది కాదు.. ఒక భారతీయ ముస్లిం విద్యార్థి మేధస్సు నుంచి పుట్టిన ఆలోచన. ఇంగ్లాండ్ రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు పుట్టిన ఆ పదమే.. చివరకు దేశ విభజనకు, కొత్త దేశం ఏర్పాటుకు పునాదిగా మారింది. ఇంతకీ ఆ పేరు పెట్టింది ఎవరు? ఆ పేరులోని అక్షరాల అర్థమేంటి? అనేది తెలుసుకుందాం..

చౌదరి రెహమత్ అలీ

పాకిస్తాన్ అనే పేరును మొదట ప్రతిపాదించిన వ్యక్తి చౌదరి రెహమత్ అలీ. బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రాంతానికి చెందిన ఈయన, ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతుండేవారు. అదే సమయంలో అల్లామా ఇక్బాల్ వంటి మేధావుల ఆలోచనలతో ప్రభావితమైన రెహమత్ అలీ.. భారతీయ ముస్లింల కోసం ఒక ప్రత్యేక దేశం ఉండాలనే బలమైన ఆకాంక్షను పెంచుకున్నారు.

పాకిస్తాన్ అనే పదం ఎలా పుట్టింది?

చరిత్రకారుడు స్టీఫెన్ ఫిలిప్ కోహెన్ అభిప్రాయం ప్రకారం.. పాకిస్తాన్ అనేది ఒక సంక్షిప్త నామం. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి దీనిని రూపొందించారు.

  • P – పంజాబ్
  • A – ఆఫ్ఘనిస్తాన్
  • K- కశ్మీర్
  • S- సింధ్
  • TAN – బలూచిస్తాన్

పర్షియన్, ఉర్దూ భాషల్లో పాక్ అంటే పవిత్రమైనది అని అర్థం. అంటే పాకిస్తాన్ అంటే పవిత్రమైన ప్రజల భూమి. మొదట ఇది పాక్స్తాన్‌గా ఉన్నప్పటికీ.. ఉచ్చారణ సులభం కోసం మధ్యలో ఐ అక్షరాన్ని చేర్చడంతో అది పాకిస్తాన్‌గా మారింది.

లండన్ బస్సు టాప్ సీటు మీద పుట్టిన ఆలోచన..

ఈ పేరు వెనుక లండన్‌లో ప్రచారంలో ఉన్న కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒక కథనం ప్రకారం.. రెహమత్ అలీ లండన్‌లో ఒక డబుల్ డెక్కర్ బస్సు పైఅంతస్తులో కూర్చుని ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఈ పేరు ఆయన మనసులో మెదిలిందట. మరో కథనం ప్రకారం థేమ్స్ నది ఒడ్డున స్నేహితులతో నడుస్తున్నప్పుడు ఈ పేరును పంచుకున్నట్లు చెబుతారు.

మొదట ఎప్పుడు వెలుగులోకి వచ్చింది?

జనవరి 28, 1933న చౌదరి రెహమత్ అలీ ఒక కరపత్రాన్ని ప్రచురించారు. అందులో ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ అనే పదాన్ని వాడారు. అంతకుముందు 1928లో ఒక జర్నలిస్ట్ ఈ పేరుతో వార్తాపత్రిక కోసం అనుమతి కోరినప్పటికీ.. రాజకీయంగా ఈ పేరును ఒక దేశం పేరుగా మార్చిన ఘనత మాత్రం రెహమత్ అలీకే దక్కుతుంది. ఒక విద్యార్థి మేధస్సులో పుట్టిన చిన్న పదం, 1947లో ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం ఏర్పడటానికి కారణమైంది. కేవలం అక్షరాల కలయికగా మొదలైన ఈ పేరు.. చివరకు చరిత్రనే మార్చివేసింది.