
Tiger Shocking Facts: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మైదాన ప్రాంతాలు, గ్రామాల సరిహద్దుల్లో పులులు సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు అడవిని విడిచి పులులు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి? అవి మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి? వాటిని సురక్షితంగా అడవికి ఎలా పంపాలి? అనే విషయాలపై అటవీ శాఖ అధికారి ఎం. రామ్మోహన్ (DFO) ‘వైల్డ్‌లైఫ్ రియాలిటీ’ (Wildlife Reality)లో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే ఓ ఇంటర్వ్యూలు పులులపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
పులిని అడవికి ఒక ‘గొడుగు’ (Umbrella) లాంటిదిగా వర్ణించవచ్చు. మనం గొడుగు పట్టుకుంటే మనకు ఎలా రక్షణ లభిస్తుందో, అడవిలో పులి ఉంటే మిగిలిన జంతువులన్నింటికీ అలాగే రక్షణ ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పులి పాత్ర అత్యంత కీలకం. ఒకప్పుడు మన దేశంలో లక్షల్లో ఉన్న పులుల సంఖ్య, స్వాతంత్ర్యం వచ్చే నాటికి కొన్ని వేలకు, ఆ తర్వాత 1970ల నాటికి వందల్లోకి పడిపోయిందన్నారు. అయితే ప్రస్తుత సంరక్షణ చర్యల వల్ల మళ్లీ వాటి సంఖ్య పెరుగుతోంది.
పులులు అడవి దాటి రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి:
ఆహార కొరత: అడవిలో జింకలు, దుప్పులు, అడవి పందులు వంటి శాకాహార జంతువుల సంఖ్య ప్రతి ఏటా 60 నుంచి 70 శాతం పెరగాలి. అప్పుడే పులులకు సరిపడా ఆహారం లభిస్తుంది. అడవుల్లో వాటి సంఖ్య తగ్గినప్పుడు పులులు ఆహారం కోసం అడవి దాటి వచ్చి, రైతుల ఆవులు, దూడలపై దాడులు చేస్తాయి. పులులకు వందల కిలోమీటర్లు ప్రయాణించే సహజ గుణం ఉంటుంది. మహారాష్ట్రలోని ‘తడోబా’ అడవుల నుండి కూడా పులులు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి తెలుగు రాష్ట్రాల అడవుల్లోకి ప్రవేశిస్తుంటాయన్నారు.
చాలా మంది పులులు మనుషులను తింటాయని భయపడతారు. కానీ, రామ్మోహన్ గారి ప్రకారం.. పులి సహజ ఆహారంలో మనిషి అనేవాడు అస్సలు ఉండడు. ఏదైనా పులి ముసలిదైపోయి, వేటాడే శక్తి కోల్పోయినప్పుడు లేదా దానికి తీవ్రమైన గాయాలైనప్పుడు మాత్రమే సులభంగా దొరికే మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. అటువంటి పులులను మాత్రమే ‘ప్రాబ్లమ్ యానిమల్’ (Problem Animal) గా గుర్తించి, జూ పార్కులకు తరలిస్తుంటారు.
సాధారణంగా మనం పులి పరిగెత్తి పరిగెత్తి వేటాడుతుందని అనుకుంటాం. కానీ అది నిజం కాదని రామ్మోహన్ వివరించారు. పులి ఎక్కువగా పరిగెత్తదు. దానికి ‘ఎండ్లెస్ పేషెన్స్’ (అంతులేని ఓపిక) ఉంటుంది. గంటల తరబడి పొదల్లో పొంచి ఉండి, సరైన సమయం చూసి ఒక్కసారిగా శత్రువుపై దాడి చేస్తుంది
పులి వస్తున్న విషయాన్ని అడవిలోని మిగిలిన జంతువులకు చెట్ల పైనుండే లంగూర్స్ (కొండముచ్చులు) ప్రత్యేకమైన కూతల ద్వారా అప్రమత్తం చేస్తాయి. మగ పులులు తమ సరిహద్దులను గుర్తించడానికి చెట్లపై గోళ్లతో గీరడం, మూత్ర విసర్జన (Urination) చేయడం వంటివి చేస్తాయి.
జనావాసాల్లోకి పులి వచ్చినప్పుడు దానిపై రాళ్లు వేయడం, కర్రలతో బెదిరించడం లేదా దాన్ని ఇరిటేట్ చేయడం వంటి పనులు అస్సలు చేయకూడదు. పులి తన ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చి, ఆకలి తీరిన తర్వాత సాధారణంగా వెళ్ళిపోతుంది. దానికి కోపం తెప్పిస్తేనే అది తిరగబడుతుంది. అటవీ ప్రదేశంలో వెళ్తున్నప్పుడు తప్పకుండా చేతిలో కర్ర ఉండాలి. ఏదైనా సమయంలో పులి ఎదురు పడితే వెంటనే కర్రను, చేతులను పైకెత్తాలి. అలాంటి సమయంలో పులి నాకన్న శక్తివంతమైన వ్యక్తి ఉన్నాడని గ్రహించి ఏమి చేయదని చెబుతున్నారు. పులి కేవలం నాలుగు కాళ్ల జంతువులపై మాత్రమే హటాక్ చేస్తుంది. అదే మనిషి అయితే ఎత్తుగా ఉండి, చేతులు పైకెత్తి, చేతిలో కర్ర లాంటి ఉంటే పైకెత్తినట్లయితే భయపడి ఏమి చేయదని వివరించారు.
అటవీ శాఖలో ప్రత్యేక ‘టైగర్ ట్రాకర్స్’ (Tiger Trackers) ఉంటారు. వీరు పులి అడుగుజాడల ఆధారంగా అది ఎటు వెళ్తుందో అంచనా వేస్తారు. ఒకవేళ అది జనావాసాల్లోనే ఉండిపోతే అటవీ శాఖ అనుమతితో దానికి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి సురక్షితంగా తిరిగి అడవికి తరలిస్తారు.
పర్యావరణాన్ని కాపాడటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. అడవి బాగుంటేనే మనకు ఆక్సిజన్, నీరు అందుతాయి. పులుల గురించి ప్రజల్లో సరైన అవగాహన పెంచడం ద్వారానే వాటిని, మన పర్యావరణాన్ని కాపాడుకోగలమని ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టమవుతోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి