
సాయంత్రం వేళ వేడి వేడి టీ.. పక్కన కరకరలాడే సమోసా.. ఈ కాంబినేషన్ అంటే ఇష్టపడని భారతీయులు ఉండరు. వర్షం పడుతున్నప్పుడు సాస్ లేదా చట్నీతో సమోసా తింటే ఆ మజాయే వేరు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ త్రిభుజాకార స్నాక్ గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. చాలా మందికి వచ్చే సందేహం.. సమోసాను ఇంగ్లీష్‌లో ఏమంటారు? నిజానికి.. బిర్యానీ, పిజ్జా లాగే సమోసాకు ప్రత్యేకమైన ఇంగ్లీష్ పేరు లేదు. దీనిని ఇంగ్లీష్‌లో Triangular Pastry with Savory Filling అని వర్ణించినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా సమోసా అనే పేరుతోనే పిలుస్తారు. అది అరబ్ దేశాలైనా, పాశ్చాత్య దేశాలైనా ఈ పేరుతోనే పాపులర్ అయ్యింది.
సమోసా అనగానే మనకు భారతీయ వంటకం అనిపిస్తుంది. కానీ దీని మూలాలు పశ్చిమాసియాలో ఉన్నాయి. పర్షియన్ భాషలో దీనిని సంబోసా అని, అరబిక్ గ్రంథాలలో సాన్‌బుసాక్ అని పిలిచేవారు. శతాబ్దాల క్రితం వ్యాపారుల ద్వారా ఇది భారతదేశానికి పరిచయమైంది. మన దగ్గరకు వచ్చాక భారతీయ సుగంధ ద్రవ్యాలు తోడై దేశీ సమోసాగా రూపాంతరం చెందింది.
సమోసాలో కూడా ఎన్నో వెరైటీలు ఉన్నాయి.
ఉత్తర భారతం: ఇక్కడ బంగాళాదుంపలు, బఠానీలతో చేసే సమోసాలు ఫేమస్.
హైదరాబాద్: మన భాగ్యనగరంలో మటన్, చికెన్ కీమా సమోసాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే టీ కొట్టు దగ్గర దొరికే చిన్న ఉల్లి సమోసా కూడా చాలా ఫేమస్.
ఆధునిక రుచులు: ఇప్పుడు పిజ్జా సమోసా, పాస్తా సమోసా, చాక్లెట్ సమోసా వంటి ఫ్యూజన్ వంటకాలు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి.
సమోసా ఎంత రుచిగా ఉన్నా, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమోసా తయారీలో వాడే మైదా, బంగాళాదుంపలు కార్బోహైడ్రేట్లను పెంచుతాయి. వీటిని అతిగా తింటే ఊబకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, రుచి కోసం మితంగా తింటేనే ఆరోగ్యానికి మేలు.