యావత్ ప్రపంచం ప్రస్తుతం పలు రకాల కాలుష్యంతో పోరాడుతోంది. పరిశ్రమల వ్యర్థాలు, ప్రజల అజాగ్రత్త, ఉద్దేశపూర్వకంగా పర్యావరణానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యల వల్ల పర్యావరణంతో చెలగాటమాడుతున్న అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొంతకాలంగా కాలుష్య సమస్య తీవ్రతరం అవుతోంది. ప్రభుత్వాలు ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని చాలా మంది ప్రజలు మానుకోవడం లేదు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఈ వీడియోను ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో చిత్రీకరించారు. ఇందులో కొందరు ట్యాక్సీలో వచ్చి రోడ్డుపక్కన ఆపి పెద్ద పెద్ద సంచుల్లో నింపిన పూల వ్యర్థాలను సముద్రపు నీటిలో పడేశారు. ఒకదాని తర్వాత ఒకటి రెండు, మూడు పువ్వుల వ్యర్థాలను నీటిలో పడేశారు. పక్కనే నిలబడిన ఎవరో వీటన్నింటిని వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది. సముద్రపు నీటిని వారు కలుషితం చేస్తున్న తీరు అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.
ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ ఉజ్జల్ పూరి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో తనను చాలా బాధపెడుతోందని వ్యాఖ్యానించారు. పౌరులు తమ వైఖరిని మార్చుకోకపోతే, భౌతిక మౌలిక సదుపాయాలను ఎంత మెరుగుపరిచినా నగర జీవితాన్ని మెరుగుపరచలేమని పేర్కొన్నారు. ముంబై పోలీసులతో పాటు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్‌ను కూడా ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్‌ని ట్యాగ్ చేసింది.
ఆనంద్ మహీంద్రా ట్వీట్..
It hurts just to see this. No amount of improvement in physical infrastructure can improve the city’s quality of life if the civic attitude isn’t transformed. @IqbalSinghChah2 @MumbaiPolice https://t.co/Efh0ssHQ3f
— anand mahindra (@anandmahindra) November 21, 2023
దీంతో రంగంలోకి దిగిన బీఎంసీ అధికారులు.. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న ఆ వ్యక్తులను గుర్తించారు. వారికి రూ.10వేల జరిమానా విధించారు.