గోరింక.. తెలివైన పక్షి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!
మన చుట్టూ తిరిగే గోరింక పక్షి (కామన్ మైనా) అనేక ఆశ్చర్యకరమైన విషయాలను కలిగి ఉంది. నల్లటి తల, పసుపు కళ్ళు, గోధుమ రంగు ఈకలతో ఉండే ఈ పక్షులు మనుషులకు దగ్గరగా జీవించడాన్ని ఇష్టపడతాయి. జీవితాంతం ఒకే భాగస్వామితో నమ్మకంగా ఉంటూ, చెట్ల తొర్రల్లో గూళ్లు కట్టి పిల్లలను పెంచుతాయి.

మన ఇళ్ల చుట్టూ, గోడల మీద ఎంతో చురుగ్గా తిరుగుతూ కనిపించే తెలివైన పక్షి గోరింక. దీనిని ఆంగ్లంలో కామన్ మైనా (Common Myna) అని పిలుస్తారు. నల్లటి తల, గోధుమ రంగు శరీరం, పసుపు రంగు ముక్కు, కాళ్లు, కళ్ల వెనుక భాగంలో ఉండే పసుపు రంగు చర్మంతో ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. రెక్కల కింద ఉండే తెల్లటి మచ్చలు వీటి మరో ప్రత్యేకత. ఈ పక్షులు గ్రామాలు, నగరాలు అనే తేడా లేకుండా మనుషులు నివసించే ప్రాంతాలకు దగ్గరగా ఉండటానికి ఇష్టపడతాయి.
గోరింకలు పండ్లు, పురుగులు, చిన్న చిన్న కీటకాలు, ఇతర ఆహార పదార్థాలను తింటాయి. ఇవి తీతువు పిట్టను పోలి కనిపించినప్పటికీ, శరీర ఆకృతి, రంగులు, కళ్ల వెనుక ఉండే పసుపు రంగు చర్మం వీటిని ప్రత్యేకంగా గుర్తించేలా చేస్తాయి.
జీవిత భాగస్వామి విషయంలో గోరింకలు ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా ఒకే భాగస్వామితో జతకట్టి కలిసి జీవిస్తాయి. కొన్ని జంటలు జీవితాంతం కలిసే ఉంటాయి. చెట్ల తొర్రల్లో, భవనాల సందుల్లో గూళ్లు నిర్మించుకుని గుడ్లు పెడతాయి. గుడ్లను పొదగడం నుంచి పిల్లలకు ఆహారం అందించి పెంచడం వరకు తల్లిదండ్రులిద్దరూ బాధ్యత పంచుకుంటాయి.
గోరింకల్లో మరో ఆసక్తికరమైన లక్షణం శబ్దాలను అనుకరించే సామర్థ్యం. మనుషులు మాట్లాడే మాటలను, ఇతర పక్షుల కూతలను, చుట్టుపక్కల వినిపించే శబ్దాలను అనుకరించగలవు. అంతేకాదు.. శత్రువులను ఎదుర్కోవడంలోనూ ఇవి వెనుకడుగు వేయవు. తమ గూడు, పిల్లలకు ప్రమాదం ఎదురైనప్పుడు కాకులు వంటి పెద్ద పక్షులను సైతం ధైర్యంగా తరిమికొడతాయి.
సాయంత్రం కాగానే గోరింకలు పెద్ద సంఖ్యలో ఒకే చెట్టుపై లేదా అనువైన ప్రదేశంలో గుమిగూడి సామూహికంగా నిద్రిస్తాయి. ఇలా పదుల నుంచి వందల సంఖ్యలో, కొన్నిసార్లు వేల సంఖ్యలో కూడా ఒకేచోట చేరుతాయి.
భారత ఉపఖండం గోరింకలకు సహజ నివాస ప్రాంతం. అయితే విదేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవి ఆక్రమణ జాతిగా మారి స్థానిక పక్షులతో ఆహారం, నివాసం కోసం పోటీ పడుతున్నాయి. మన దేశంలో మాత్రం మనుషుల నివాస ప్రాంతాలకు దగ్గరగా జీవిస్తూ పర్యావరణంలో కీలక పాత్ర పోషించే తెలివైన పక్షుల్లో గోరింక ఒకటి.
