
సుమారు ఐదు అడుగుల ఎత్తు పెరిగే షూబిల్ పక్షిని మొదటిసారి చూసిన వారు ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. దీని చూపు అంత పదునుగా ఉంటుంది. అయితే, దీని వింత ప్రవర్తన, నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే బద్ధకం కారణంగా దీనికి ‘తెలివి తక్కువ పక్షి’ అనే ముద్ర పడింది. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న ఈ వింత పక్షి అలవాట్లు, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్‌లో దీనికి ఉండే డిమాండ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బూటు లాంటి ముక్కు: ఈ పక్షి ముక్కు సుమారు ఒక అడుగు పొడవు, ఐదు అంగుళాల వెడల్పు ఉండి.. చూడటానికి ఒక పెద్ద బూటు ఆకారంలో ఉంటుంది. అందుకే దీనికి ‘షూబిల్’ అని పేరు వచ్చింది. దీని ముక్కు అంచులు కత్తిలా చాలా పదునుగా ఉంటాయి.
పెలికాన్ కుటుంబం: చాలా మంది దీనిని కొంగ అనుకుంటారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఇది పెలికాన్ పక్షి కుటుంబానికి మరింత దగ్గరి సంబంధం కలిగి ఉంది.
భయంకరమైన వేటగాడు: ఇది సాధారణంగా చేపలు, పాములు, పెద్ద ఈల్ చేపలను తింటుంది. అయితే ఆకలి వేస్తే చిన్న పరిమాణంలో ఉండే మొసళ్లను, ఉడుములను కూడా వేటాడి తినేయగలదు.
ఇంత పవర్‌ఫుల్ పక్షిని ‘తెలివి తక్కువ పక్షి’ అని ఎందుకు అంటారు?
దీనికి గల ప్రధాన కారణం దాని వింత ప్రవర్తన మరియు మందబుద్ధి:
ఆలోచనా శక్తి తక్కువ: శాస్త్రవేత్తల ప్రకారం, షూబిల్ పక్షి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. కొన్నిసార్లు దాని ముందు సులభంగా దొరికే ఆహారం ఉన్నా.. దాన్ని తినాలా వద్దా అని ఏమీ తోచనట్టు చాలా సేపు అలానే చూస్తూ ఉండిపోతుంది.
మనుషులకు స్వాగతం: అడవి పక్షులు మనుషులను చూస్తే పారిపోతాయి. కానీ షూబిల్ పక్షి మాత్రం మనుషులు దగ్గరకు వచ్చినప్పుడు భయపడకుండా, తన రెక్కలను విప్పి ఒక వింత పద్ధతిలో తల ఊపుతూ కదులుతుంది. శాస్త్రవేత్తలు దీనిని ‘మనుషులకు స్వాగతం పలికే’ వింత అలవాటుగా భావిస్తారు.
అంతరించిపోతున్న అరుదైన జీవి:
ప్రస్తుతం ఈ అరుదైన పక్షుల సంఖ్య ప్రపంచంలో వేగంగా తగ్గిపోతోంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కేవలం 3,300 నుండి 5,300 గ్రేటర్ షూబిల్ పక్షులు మాత్రమే బతికి ఉన్నాయి. వీటి ఆవాసాలు దెబ్బతినడం, అక్రమ రవాణా దీనికి ప్రధాన కారణాలు.
కొన్ని అరబ్ దేశాలలో ధనవంతులు తమ హోదాకు, ప్రతిష్టకు చిహ్నంగా ఈ పక్షిని ఇళ్లలో పెంచుకుంటారు. అందువల్ల అంతర్జాతీయ ఆన్‌లైన్ బ్లాక్ మార్కెట్‌లో ఒక షూబిల్ పక్షి ధర సుమారు 10,000 డాలర్ల (దాదాపు రూ. 8.3 లక్షలకు పైగా) వరకు పలుకుతుందని నివేదికలు చెబుతున్నాయి.