Nagula Chavithi: నాగుల చవితి రోజు ఆసక్తికర సంఘటన.. పాము, ముంగిసల మధ్య..

| Edited By: Narender Vaitla

Nov 18, 2023 | 4:26 PM

ఇలా నాగుల చవితి జరుపుకోవడం భక్తుల ఆనవాయితీ. ఇందులో భాగంగానే శుక్రవారం కూడా.. విజయనగరం జిల్లాలో కూడా భక్తులు పెద్ద ఎత్తున నాగుల చవితి జరుపుకున్నారు. ఈ క్రమంలోనే గజపతి నగరంలో పలువురు భక్తులు స్థానిక పైడి తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్ట వద్దకు చేరుకున్నారు పలువురు భక్తులు. అక్కడ ఉన్న పుట్టకు భక్తులంతా కలిసి ప్రత్యేక పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా...

Nagula Chavithi: నాగుల చవితి రోజు ఆసక్తికర సంఘటన.. పాము, ముంగిసల మధ్య..
Nagula Chavithi
Follow us on

నాగులచవితిని ఉత్తరాంధ్ర పెద్ద పండుగగా పిలుస్తారు. నాగుల చవితి పర్వదినాన కుటుంబం అంతా ముస్తాబై అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో పుట్ట వద్దకు చేరుకుంటారు. అక్కడ పుట్టకు పూజలు చేసి పసుపు, కుంకుమ చల్లి పుట్ట వద్ద కోడిగుడ్లు పెట్టి బాణసంచా కాలుస్తారు. అక్కడే కొంత సేపు గడిపి తరువాత ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్తారు.

ఇలా నాగుల చవితి జరుపుకోవడం భక్తుల ఆనవాయితీ. ఇందులో భాగంగానే శుక్రవారం కూడా.. విజయనగరం జిల్లాలో కూడా భక్తులు పెద్ద ఎత్తున నాగుల చవితి జరుపుకున్నారు. ఈ క్రమంలోనే గజపతి నగరంలో పలువురు భక్తులు స్థానిక పైడి తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్ట వద్దకు చేరుకున్నారు పలువురు భక్తులు. అక్కడ ఉన్న పుట్టకు భక్తులంతా కలిసి ప్రత్యేక పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా ఓ నాగుపాము వారి ముందు ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా వారి ముందుకు వచ్చిన పామును చూసిన భక్తులు భయంతో అక్కడ నుంచి పారిపోయారు. తరువాత కొద్దిసేపటికి తమాయించుకొని అమ్మవారి ఆలయం వద్ద పుట్ట వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు. అలా వెళ్ళే సరికి నాగుపాము బుసలు కొడుతూ పడగ విప్పి కనిపించింది.

దీంతో భక్తులంతా కలిసి నాగులచవితి రోజు పూజలు చేస్తుంటే తమ పూజలకు సాక్షాత్తు నాగుపాము కరుణించి తమకు దర్శనమిచ్చిందని ఆనంద పడ్డారు. వెంటనే నాగుపాముకు నమస్కారం చేసుకొని కొంత సేపు పాముకు సమీపంలోనే భక్తిశ్రద్దలతో గడిపారు. అలా భక్తులు పొందుతున్న ఆనంద ఘడియలు వారికి ఎంతోసేపు లేకుండా పోయాయి. పాము పడగ విప్పి బుసలు కొడుతున్న సమయంలోనే అకస్మాత్తుగా ఓ ముంగిస దూకుడుగా వచ్చి పాము పై దాడికి దిగింది. దీంతో పాము కూడా ముంగిస పై ప్రతి దాడికి దిగింది. పాము, ముంగిస మధ్య జరిగిన పోరు, ఆ రెండింటి మధ్య శబ్దాలు వింటున్న భక్తులు భయాందోళనకు లోనయ్యారు.

పాము, ముంగిస మధ్య జరుగుతున్న జాతి వైరం చూసిన భక్తులు ఇందేమి భాధ రా బాబు.. నాగులచవితి కదా మా కోసం స్వయంగా శివుడి మెడలో నుండి నేరుగా వచ్చి దర్శనం ఇచ్చింది అనుకుంటే ఇలా ముంగిస దాడి చేసింది అని అంతా హైరానా పడ్డారు. నాగుపాము దర్శనంతో మేలు జరుగుతుందని అనుకుంటే ఇలా ముంగిస దాడి చేసింది. ఈ దాడితో పాము పగపట్టి ఏమి కీడు చేస్తుందో అని భయంతో వణికిపోయారు భక్తులు. ఆ తరువాత కొద్దిసేపటికి ముంగిస ప్రక్కనే ఉన్న పొదల్లోకి పారిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముంగిస దాడిలో పాము తీవ్రంగా గాయాల పాలై కదల్లేని పరిస్థితికి చేరింది.

దీంతో వెంటనే పాముకు ఓ వైపు పూజలు చేస్తూనే మరో వైపు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు భక్తులు. అయితే మరికొద్ది సేపటికి పాము కూడా నెమ్మదిగా కదులుతూ అక్కడ నుండి ప్రక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోవడంతో భక్తులు కొంత ఊరట చెందారు. నాగుల చవితి నాడు జరిగిన ఈ నాగుపాము దర్శనం, పాము ముంగిస జాతి వైరం చుట్టుప్రక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..