
ఉత్తర రొమేనియాలోని కార్పాతియన్ పర్వత ప్రాంతంలో క్రమక్షయం వల్ల భూగర్భంలో ఉన్న ముడి అంబర్ నిక్షేపాలు తరచుగా బయటపడుతుంటాయి. బుజౌ కౌంటీలోని కోల్టీ గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు స్థానిక వాగులో దొరికిన ఒక బరువైన ఎర్రటి రాయిని తన ఇంటికి తెచ్చుకుని, దశాబ్దాల తరబడి పడకగది తలుపు మూసుకుపోకుండా డోర్‌స్టాప్‌గా వాడుకుంది. 1991లో ఆమె మరణించిన తర్వాత, ఆ ఇంటిని వారసత్వంగా పొందిన ఆమె బంధువుకు ఆ రాయి సాధారణ నదీ రాయి కాదని అనుమానం వచ్చింది. దీంతో అతను ఆ రాయిని రొమేనియా ప్రభుత్వ అధికారులకు అప్పగించగా, అధికారులు దానిని సమగ్ర పరిశోధనల కోసం పోలాండ్‌లోని క్రాకోవ్ చరిత్ర మ్యూజియంలోని నిపుణులకు పంపారు.
పోలిష్ నిపుణుల నిర్ధారణ
పోలాండ్‌కు చెందిన ఖనిజ, భూగర్భ శాస్త్రవేత్తలు ఆ నమూనాను పరిశీలించి, అది నకిలీ రాయి కాదని, అత్యంత స్వచ్ఛమైన నిజమైన అంబర్ అని నిర్ధారించారు. అంతేకాకుండా కార్బన్ డేటింగ్ , ఇతర శాస్త్రీయ పరీక్షల ద్వారా దాని వయస్సు 38.5 మిలియన్ల నుండి దాదాపు 70 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని తేల్చారు. 7.7 పౌండ్లు (దాదాపు 3.5 కిలోగ్రాములు) బరువున్న ఈ రాయి, ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన అత్యంత భారీ, చెక్కుచెదరని అంబర్ ముక్కలలో ఒకటిగా రికార్డు సృష్టించింది. రొమేనియా ప్రభుత్వం దీనిని సంరక్షిత జాతీయ సంపదగా ప్రకటించి, బుజౌ కౌంటీ మ్యూజియంలో 2022 నుండి సాధారణ ప్రజల వీక్షణార్థం ప్రదర్శనలో ఉంచింది.
పురాతన చెట్టు జిగురు నుండి అంబర్ ఎలా ఏర్పడుతుంది?
లక్షలాది సంవత్సరాల క్రితం జీవించిన పురాతన శంఖాకారపు వృక్షాలు తమ బెరడుకు గాయాలైనప్పుడు రక్షణ కవచంగా, బ్యాక్టీరియా , కీటకాల దాడులను తట్టుకోవడానికి జిగటగా ఉండే ప్రత్యేకమైన రెసిన్‌ను (రక్షక జిగురు) స్రవించేవి. సాధారణంగా చెట్లలో ఉండే రసం వేరు, ఈ రెసిన్ వేరు. కాలక్రమేణా ఆ చెట్ల నుండి కారిన జిగురు మట్టి పొరల్లో, నదీ అవక్షేపాలలో కూరుకుపోయి, విపరీతమైన భూగర్భ పీడనం , ఉష్ణోగ్రతలకు గురై లక్షలాది సంవత్సరాల పాటు రసాయనికంగా గట్టిపడి రాతిలాంటి శిలాజంగా (Fossilized Resin) మారుతుంది. దీనినే శాస్త్ర పరిభాషలో ‘అంబర్’ అంటారు.
రుమనైట్ – ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన అంబర్
ఈ ప్రాంతంలో లభించే అంబర్‌ను స్థానికులు ‘చిహ్లింబర్’ అని పిలుస్తారు. కాగా ఖనిజ శాస్త్రవేత్తలు దీని ప్రత్యేకతను గుర్తించి రుమనైట్(Rumanite) అని పేరు పెట్టారు. సాధారణంగా బాల్టిక్ ప్రాంతాల్లో దొరికే అంబర్ లేత పసుపు రంగులో ఉంటే, రొమేనియాలోని రుమనైట్ మాత్రం ముదురు ఎరుపు, గోధుమ , దాదాపు నలుపు రంగుల గాఢమైన ఛాయలతో అత్యంత అరుదుగా దర్శనమిస్తుంది. ప్రపంచంలో ఇంత భారీ పరిమాణంలో రుమనైట్ దొరకడం చరిత్రలోనే మొదటిసారి.
ఎందుకంత విలువైనది?
మార్కెట్ లెక్కల ప్రకారం దీని విలువ సుమారు 1 మిలియన్ యూరోలుగా ప్రచారంలో ఉన్నప్పటికీ, దీని శాస్త్రీయ , పర్యావరణ విలువను డబ్బుతో లెక్కకట్టడం అసాధ్యమని మ్యూజియం డైరెక్టర్ డేనియల్ కోస్టాచే స్పష్టం చేశారు. చెట్ల నుంచి రెసిన్ ప్రవహిస్తున్నప్పుడు పురాతన కాలపు సూక్ష్మ కీటకాలు, పుప్పొడి రేణువులు , ఆనాటి వాతావరణ గాలి బుడగలు అందులోనే బంధించబడి 3డీ శిలాజాలుగా భద్రపరచబడతాయి. సాధారణ శిలాజాలు రాళ్ల పీడనానికి నలిగిపోతాయి. కానీ అంబర్ మాత్రం సేంద్రీయ పదార్థాన్ని కొన్ని కోట్ల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా కాపాడుతుంది. ఈ రాయి ద్వారా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై వాతావరణం, జీవజాలం ఎలా ఉండేవో పరిశోధించడానికి పరిశోధకులకు అద్భుతమైన అవకాశం లభించింది.
గమనిక: ఈ కథనంలో అందించిన శాస్త్రీయ , భౌగోళిక సమాచారం అంతర్జాతీయ భూగర్భ పరిశోధన నివేదికలు, మ్యూజియం రికార్డులు, మీడియా వివరాల ఆధారంగా ప్రచురించబడినది మాత్రమే.