ఆవులు రోజూ ఎన్ని గంటలు నిద్రపోతాయి..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..
మీరు రోజూ ఆవులను చూస్తూనే ఉంటారు.. కానీ ఆవు నిద్రపోవడం ఎప్పుడైనా కళ్లారా చూడడం చాలా తక్కువ. సలు ఆవులకు నిద్ర అవసరం లేదా? మనుషుల్లాగా అవి రాత్రంతా ఏకధాటిగా ఎందుకు నిద్రపోవు? నిలబడి కళ్లు తెరిచే కునుకు తీస్తాయా? ఈ ప్రశ్నలన్నింటి వెనుక ప్రకృతి ప్రసాదించిన ఓ అద్భుతమైన రక్షణ యంత్రాంగం దాగుంది. పరిశోధనల్లో వెల్లడైన ఆ నిజాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఎప్పుడు చూసినా నిశబ్దంగా నిలబడి తదేకంగా చూడటం.. నెమరు వేస్తూ గడపడం.. పల్లెల్లోనూ, నగరాల్లోనూ రోజూ కనిపించే ఆవుల జీవనశైలి ఇది. అయితే ఎవరికైనా ఓ ఆసక్తికరమైన సందేహం రావడం సహజం. సాధు స్వభావం కలిగిన ఆవులు అసలు నిద్రపోతాయా? మనుషుల్లాగా అవి రాత్రంతా ఏకధాటిగా కంటినిండా నిద్రపోవడం ఎప్పుడైనా చూశామా? ఈ ప్రశ్న వెనుక జంతు శాస్త్రవేత్తలు పరిశోధించి తేల్చిన ఎన్నో ఆశ్చర్యకరమైన రహస్యాలు ఉన్నాయి. పరిశోధకుల అధ్యయనాల ప్రకారం.. ఒక ఆరోగ్యకరమైన ఆవు రోజుకు సుమారు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతుంది. మనుషుల్లాగా రాత్రిపూట 7 నుంచి 8 గంటల పాటు నిరంతరాయంగా పడుకునే అలవాటు వీటికి అస్సలు ఉండదు. 24 గంటల వ్యవధిలో రోజంతా కొన్ని నిమిషాల చొప్పున పవర్ న్యాప్స్ తీస్తూ ఆ నాలుగు గంటల నిద్రను భర్తీ చేసుకుంటాయి. ఒక్కో విడతలో ఇవి నిద్రపోయే సమయం కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది.
నిద్ర తక్కువ.. విశ్రాంతి ఎక్కువ
నిద్ర సమయం చాలా తక్కువైనప్పటికీ, ఆవులు ఎక్కువ సమయాన్ని విశ్రాంతికే కేటాయిస్తాయి. ఒక ఆవు రోజులో దాదాపు 10 నుంచి 12 గంటల పాటు నేలపై కూర్చొని లేదా పడుకుని సేదతీరుతుంది. ఆవులు నెమరువేసే జంతువులు కాబట్టి తిన్న గడ్డిని, ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకుని పూర్తిగా జీర్ణం కావడానికి గంటల తరబడి విశ్రాంతిగా నములుతూ ఉంటాయి. ఆవులు నేలపై ప్రశాంతంగా పడుకుని నెమరువేసే సమయంలోనే వాటి శరీరంలో రక్తప్రసరణ పెరిగి, పాల ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడుతుందని వెటర్నరీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నిలబడి నిద్రపోతాయా? పడుకుంటేనే గాఢ నిద్ర..
ఆవుల విశ్రాంతి పద్ధతిలో అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే.. అవి నిలబడి కూడా నిద్రపోగలవు.
తేలికపాటి నిద్ర: కాళ్ల కండరాలు, స్నాయువులు లాక్ అయ్యే ప్రత్యేకమైన శరీర అమరిక ఉండటం వల్ల కింద పడిపోకుండా నిలబడే తేలికపాటి కునుకు తీస్తాయి.
గాఢ నిద్ర: మానసిక, శారీరక ఉత్తేజానికి అవసరమైన గాఢ నిద్రలోకి వెళ్లాలంటే మాత్రం ఆవులు తప్పనిసరిగా నేలపై పడుకుని, తలను వెనక్కి లేదా నేలకు ఆనించి ఉంచాల్సిందే. REM నిద్రలో కండరాలు పూర్తిగా విశ్రాంతి పొందుతాయి కాబట్టి ఆ స్థితిలో నిలబడటం వాటికి సాధ్యం కాదు.
ప్రకృతి ప్రసాదించిన డిఫెన్స్ మెకానిజం
ఆవులు ఇంత తక్కువ సమయం, అది కూడా చిన్న చిన్న విడతలుగా నిద్రపోవడానికి వాటి సహజ రక్షణ యంత్రాంగమే ప్రధాన కారణం. అడవుల్లో ఉన్నప్పుడు మాంసాహార వన్యప్రాణుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలా వాటి శరీర నిర్మాణం అభివృద్ధి చెందింది. ఎంతటి గాఢ నిద్రలో ఉన్నా సరే.. చిన్న శబ్దం లేదా అలికిడి కాగానే క్షణాల్లో మేల్కొని పారిపోయే శక్తి వీటికి ఉంటుంది. ఆవులను రోజూ చూస్తూనే ఉన్నా, వాటి ఈ చిన్న కునుకులు, నిలబడి నిద్రపోయే ప్రత్యేక నైపుణ్యం, జీర్ణక్రియ కోసం తీసుకునే విశ్రాంతి పద్ధతుల వెనుక ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సైన్స్ దాగుంది.
