
రెయిన్ కోట్ అంటే తెలుసు కానీ ఈ రెయిన్ గేర్ ఏంటి? అని ఆలోచిస్తున్నారు. దీని గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఎందుకంటే దీనికి మన దేశంలో ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతుంది. అయితే సాధారణంగా వర్షాకాలం మొదలైన తర్వాత మనలో చాలా మంది రెయిన్ కోట్‌లు కొనుగోలు చేస్తుంటారు. కానీ, యూరప్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రం రెయిన్ గేర్ కొంటారు. వాటినే ధరిస్తారు. అక్కడ సాధారణ రెయిన్‌కోట్‌ల కంటే రెయిన్ గేర్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇటీవల భారతదేశంలో కూడా రెయిన్ గేర్ వినియోగం వేగంగా పెరుగుతుండటంతో, దీనిపై ఆసక్తి పెరుగుతోంది.
రెయిన్ గేర్ అనేది కేవలం వర్షం నుంచి రక్షించే కోటు మాత్రమే కాదు. ఇది వాటర్‌ప్రూఫ్ జాకెట్, వాటర్‌ప్రూఫ్ ప్యాంటు, హుడ్, వాటర్‌ప్రూఫ్ బూట్లు లేదా షూ కవర్లు, అవసరమైతే గ్లౌజులతో కూడిన పూర్తి రక్షణ వ్యవస్థ. దీంతో తల నుంచి పాదాల వరకు శరీరానికి పూర్తిగా వర్షం నుంచి రక్షణ ఇస్తుంది. ఇండియాలో ఎక్కువగా ఉపయోగించే సాధారణ రెయిన్‌కోట్‌లు ప్రధానంగా శరీర పైభాగాన్ని మాత్రమే కప్పి ఉంచుతాయి. భారీ వర్షాల్లో కాళ్లు, బూట్లు లేదా దుస్తుల దిగువ భాగం తడిచే అవకాశం ఉంటుంది. అయితే రెయిన్ గేర్‌లో జాకెట్, ప్యాంటు రెండూ ఉండటంతో పాటు మణికట్టు, మెడ, నడుము భాగాల్లో ప్రత్యేక ఫిట్టింగ్ ఉంటుంది. దీంతో వర్షపు నీరు లోపలికి చొరబడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
అధిక నాణ్యత కలిగిన రెయిన్ గేర్‌లో ప్రత్యేక వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిస్తారు. దీనిపై ఉండే ప్రత్యేక పూత కారణంగా నీటి చుక్కలు బట్టలోకి ఇంకకుండా జారిపోతాయి. అలాగే ఖరీదైన మోడళ్లలో కుట్టిన భాగాలను కూడా లోపలి నుంచి ప్రత్యేకంగా సీల్ చేస్తారు. దీనిని సీమ్ సీలింగ్ అంటారు. దీంతో కుట్ల ద్వారా కూడా నీరు లోపలికి ప్రవేశించదు. చౌక రెయిన్‌కోట్‌లను ఎక్కువసేపు ధరిస్తే చెమట కారణంగా అసౌకర్యంగా అనిపించవచ్చు.
కానీ నాణ్యమైన రెయిన్ గేర్‌లో ఉపయోగించే బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ బయట నుంచి నీటిని అడ్డుకుంటూనే, శరీరంలో ఏర్పడే ఆవిరిని బయటకు పంపిస్తుంది. దీంతో ఎక్కువసేపు ధరించినా ఉక్కపోతగా అనిపించదు. ముఖ్యంగా బైక్ రైడర్లు, ట్రెక్కర్లు, హైకర్లు, సైక్లిస్టులు, డెలివరీ సిబ్బందికి రెయిన్ గేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బలమైన గాలుల్లో కూడా ఇది శరీరానికి బిగుతుగా ఉండటంతో రెయిన్‌కోట్‌లా ఎగిరిపోదు. విదేశాల్లో ఇదే కారణంగా రెయిన్ గేర్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.