గ్యాస్ ఆఫ్ చేసినా వాసన వస్తుందా? అయితే కారణం ఇదే కావొచ్చు.. నెగ్లెట్ చేస్తే నష్టమే!
వంట అయిపోయాక గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసినా, గ్యాస్ వాసన వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. ఇది రెగ్యులేటర్, హోస్, లేదా వాల్వ్ లీకేజ్ వల్ల కావచ్చు. సబ్బు నీటితో లీకేజ్ గుర్తించి, వెంటనే కిటికీలు తెరిచి, విద్యుత్ స్విచ్‌లు ముట్టకుండా, అగ్గిపుల్ల వాడకుండా ఉండాలి. వెంటనే గ్యాస్ పంపిణీ సంస్థకు తెలియజేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.

వంట అయిపోయక గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసినా.. ఉన్నట్టుండి గ్యాస్ వచ్చినట్లు అనిపిస్తుంది. అప్పుడు కంగారు పడతాం. కరెక్ట్‌గా ఆఫ్ చేసినా వాసన ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటాం. మళ్లీ ఒక సారి చెక్ చేసినా అర్థం కాదు ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అని. కానీ, చాలా మందికి తెలియని చోట్ల నుంచి గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. అయితే వంట గదిలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను ఆఫ్ చేసినప్పటికీ గ్యాస్ వాసన వస్తే దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ లీకేజీ కారణంగా అగ్నిప్రమాదాలు, పేలుళ్లు సంభవించే అవకాశం ఉండటంతో, వాసన వచ్చిన వెంటనే లీకేజీ ఎక్కడి నుంచి జరుగుతుందో గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
సాధారణంగా సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసిన తర్వాత కూడా గ్యాస్ వాసన వస్తే, మొదట అనుమానించాల్సింది రెగ్యులేటర్ సరిగ్గా అమర్చబడిందా లేదా అనే విషయాన్ని. కొన్నిసార్లు రెగ్యులేటర్ పూర్తిగా లాక్ కాకపోవడం లేదా దెబ్బతినడం వల్ల స్వల్పంగా గ్యాస్ బయటకు రావచ్చు. మరో ప్రధాన కారణం రబ్బరు హోస్ (గ్యాస్ పైపు). ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల పైపులో చిన్న పగుళ్లు, రంధ్రాలు ఏర్పడవచ్చు. బయటకు కనిపించకపోయినా వాటి ద్వారా గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. పైపు చివర్ల వద్ద ఉన్న కనెక్షన్లు సడలినా కూడా గ్యాస్ బయటకు రావచ్చు.
గ్యాస్ స్టవ్ నాబ్ పూర్తిగా మూసుకోకపోవడం లేదా స్టవ్‌లోని అంతర్గత వాల్వ్ దెబ్బతినడం కూడా వాసనకు కారణం కావచ్చు. అలాగే సిలిండర్ వాల్వ్ భాగంలో సీల్ దెబ్బతిన్నా గ్యాస్ లీకేజీ జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సిలిండర్‌ను ఉపయోగించడం ప్రమాదకరం. గ్యాస్ లీకేజీ ఉందో లేదో తెలుసుకోవడానికి సబ్బు నీటిని పైపు కనెక్షన్లు, రెగ్యులేటర్, వాల్వ్ ప్రాంతాల్లో రాయాలి. అక్కడ బుడగలు వస్తే లీకేజీ ఉన్నట్లు అర్థం. ఎట్టి పరిస్థితుల్లోనూ లీకేజీని గుర్తించేందుకు అగ్గిపుల్ల, కొవ్వొత్తి లేదా లైటర్ ఉపయోగించకూడదు. గ్యాస్ వాసన వచ్చిన వెంటనే రెగ్యులేటర్‌ను పూర్తిగా ఆఫ్ చేయాలి. ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి గాలి ప్రసరణ కల్పించాలి. ఎలక్ట్రిక్ స్విచ్‌లు ఆన్ లేదా ఆఫ్ చేయకూడదు.
మొబైల్ ఫోన్‌ను కూడా లీకేజీ ఉన్న ప్రదేశంలో ఉపయోగించకుండా ఉండటం మంచిది. మంటలు వెలిగించడం పూర్తిగా నిషేధం. లీకేజీ ఆగకపోతే వెంటనే మీ గ్యాస్ పంపిణీ సంస్థ లేదా అత్యవసర సేవా కేంద్రానికి సమాచారం ఇవ్వాలి. శిక్షణ పొందిన టెక్నీషియన్ వచ్చి పరిశీలించే వరకు సిలిండర్‌ను ఉపయోగించకూడదు. నిపుణుల సూచనల ప్రకారం, గ్యాస్ పైపును నిర్దిష్ట వ్యవధిలో మార్చడం, రెగ్యులేటర్ పరిస్థితిని తరచుగా పరిశీలించడం, సిలిండర్‌ను ఎల్లప్పుడూ నిలువుగా ఉంచడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. గ్యాస్ వాసనను చిన్న సమస్యగా భావించకుండా, వెంటనే స్పందించడం ద్వారా ప్రాణాలు, ఆస్తిని రక్షించుకోవచ్చు.
