
ప్రకృతిలో ప్రతి ప్రాణికీ ఒక ఆయుధం ఉంటుంది.. కానీ పాముల దగ్గర ఉండే విషం మాత్రం అత్యంత ప్రమాదకరం. ముఖ్యంగా సరీసృపాల ప్రపంచంలో పాములు అంటేనే ఒక భయం, ఒక ఉత్కంఠ. ముఖ్యంగా పాము జాతులలో కింగ్ కోబ్రా, రక్త పింజరి అత్యంత ప్రాణాంతకమైనవి. ఈ రెండు పాములు కూడా మనుషులను లేదా ఏ జంతువునైనా క్షణాల్లో చంపగల విషపూరితమైన ఆయుధాలను కలిగి ఉంటాయి. అయితే వీటి విషం పనిచేసే తీరు, వేగం, జీవనశైలిలో చాలా ఆసక్తికరమైన తేడాలు ఉన్నాయి.
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విష సర్పం. ఇది అత్యంత తెలివైనది మాత్రమే కాదు.. ఇతర పాములను కూడా వేటాడి తినేస్తుంది. దీనిలో న్యూరోటాక్సిక్ విషం ఉంటుంది. ఇది నేరుగా నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దీని కాటుకు గురైన వ్యక్తికి మెదడు నుండి శరీరానికి అందే సంకేతాలు నిలిచిపోతాయి. పక్షవాతం రావడం, శ్వాస తీసుకోవడం కష్టమవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కింగ్ కోబ్రా ఒక్క కాటుతో ఏకంగా 7 మిల్లీలీటర్ల వరకు విషాన్ని చిమ్మగలదు. ఈ మోతాదు ఒక పెద్ద ఏనుగును కూడా గంటల వ్యవధిలో చంపడానికి సరిపోతుంది.
రక్త పింజర చిన్నదిగా అనిపించినా, దీని విషం కింగ్ కోబ్రా కంటే తక్కువ ఏమీ కాదు. ఇందులో హెమోటాక్సిక్ విషం ఉంటుంది. ఈ విషం నేరుగా రక్త కణాలపై, కణజాలాలపై దాడి చేస్తుంది. దీనివల్ల రక్తస్రావం కావడం, అవయవాలు కుళ్లిపోవడం, తీవ్రమైన నొప్పి కలుగుతాయి. కింగ్ కోబ్రా విషం కంటే దీని విషం కలిగించే నొప్పి చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇవి దట్టమైన అడవులతో పాటు పంట పొలాల్లో, నివాస ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంటాయి. అందుకే ఇవి మనుషులకు ఎక్కువ ప్రమాదకరం.
కింగ్ కోబ్రా, గ్లాస్ వైపర్ మధ్య ఒకవేళ పోరాటం జరిగితే, కింగ్ కోబ్రాకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కింగ్ కోబ్రా పరిమాణంలో చాలా పెద్దది. అంతేకాకుండా కింగ్ కోబ్రాకు ఇతర పాముల విషాన్ని తట్టుకునే కొంత రోగనిరోధక శక్తి ఉంటుంది. కింగ్ కోబ్రా తన శరీరాన్ని భూమి నుండి పైకి లేపి, దూరం నుండి వేగంగా దాడి చేయగలదు.