
సాధారణంగా భారతీయ వంటల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి చాలా ముఖ్యమైన పదార్థాలు. అయితే దేశంలో ఒక ప్రత్యేకమైన నగరం ఉంది. అక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లిని పండించడం, అమ్మడం తినడం పూర్తిగా నిషేధం. ఆ నగరమే జమ్మూకశ్మీర్‌లోని కత్రా. ఇది దేశంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని పూర్తిగా నిషేధించిన ఏకైక నగరం. ఈ నగరంలోని కూరగాయల మార్కెట్లలో లేదా కిరాణా దుకాణాలలో ఉల్లిపాయలు దొరకవు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా వీటితో వండిన ఆహారం ఉండదు. కానీ దీనికి ఒక బలమైన కారణం ఉంది.
కత్రా నగరం పవిత్రమైన మాతా వైష్ణో దేవి ఆలయానికి ప్రధాన ద్వారం. ఈ ఆలయం పర్వతాలపై దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైష్ణో దేవి భక్తులు ఈ నగరం గుండానే ప్రయాణిస్తారు. ఈ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడటానికి.. ఉల్లిపాయలు, వెల్లుల్లిని ఇక్కడ పూర్తిగా నిషేధించారు. హిందూ తత్వశాస్త్రం ప్రకారం.. ఉల్లిపాయలు, వెల్లుల్లిని తామసిక ఆహారాలుగా పరిగణిస్తారు. వీటిని తినడం వల్ల సోమరితనం, కోపం, ప్రతికూల భావాలు పెరుగుతాయని నమ్ముతారు.
పూజలు, ఉపవాసాలు లేదా ఇతర మతపరమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ ఆహారాలను తినకూడదని చెబుతారు. మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే భక్తులు సాత్వికమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో కత్రాలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకపోయినా ఇక్కడ ఆహారం చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ లభించే సాత్విక ఆహారం రుచి, పోషకాలతో నిండి ఉంటుంది. కత్రా కేవలం మాతా వైష్ణో దేవి ఆలయానికి ఒక ప్రవేశ ద్వారం మాత్రమే కాదు.. ఇది ఆధ్యాత్మిక విశ్వాసం, క్రమశిక్షణకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..