అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాముగా గుర్తింపు పొందిన హై బ్లూ గ్రీన్ ట్రీ పైథాన్ ధర రూ.3.8 కోట్లకు పైగా పలికింది. అరుదైన నీలం రంగు, ప్రత్యేక జన్యువులు, క్లిష్టమైన బ్రీడింగ్ ప్రక్రియ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల భారీ డిమాండ్ ఈ పామును అత్యంత విలువైన జీవిగా మార్చాయి.

అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు..
High Blue Green Tree Python

Updated on: Jul 29, 2026 | 1:44 PM

ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవి కాగా, మరికొన్ని పూర్తిగా విషరహితమైనవి. సాధారణంగా పామును చూస్తే చాలామంది భయపడుతుంటారు. కానీ ప్రపంచంలోని కొందరు కోటీశ్వరులు, అరుదైన జంతువుల సేకరించే వారు మాత్రం ఒక ప్రత్యేకమైన పామును సొంతం చేసుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడరు. ఆ పాము పేరు హై బ్లూ గ్రీన్ ట్రీ పైథాన్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాముల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ అరుదైన జాతి ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచింది.

కళ్లుచెదిరే ధర..

అంతర్జాతీయ మార్కెట్ నివేదికల ప్రకారం.. ఒక ప్రైవేట్ విక్రయంలో హై బ్లూ గ్రీన్ ట్రీ పైథాన్ దాదాపు 445,800 అమెరికన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.3.8 కోట్లకు పైగా) ధర పలికినట్లు తెలుస్తోంది. ఈ స్థాయి ధర పలికిన పాములు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన పాముల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఈ పాములో ప్రత్యేకత ఏంటి?

సాధారణ గ్రీన్ ట్రీ పైథాన్‌లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అయితే అరుదైన జన్యు మార్పుల కారణంగా కొన్ని పాములు గాఢమైన నీలం రంగులో కనిపిస్తాయి. వీటినే హై బ్లూ గ్రీన్ ట్రీ పైథాన్‌లు అని పిలుస్తారు. ఈ పాముల శరీరంపై కనిపించే నీలిరంగు మెరుపు, తెల్లటి గీతలు, ఆకర్షణీయమైన కళ్లతో ఇవి ప్రకృతిలో ఒక అద్భుతంలా కనిపిస్తాయి. ఇలాంటి రంగు సహజంగా ఏర్పడటం అత్యంత అరుదు.

ఇది కూడా చదవండి: 4 ఏళ్లు ఇంచు కూడా కదలకుండా సమాధిలో జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!

ఎందుకు అంత ధర?

ఈ పాముల విలువ పెరగడానికి ప్రధాన కారణం వీటి బ్రీడింగ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ కావడమే. పెంపకందారులు తరాల తరబడి ఉత్తమ జన్యువులు కలిగిన పాములను ఎంపిక చేసి పెంపకం చేపట్టాల్సి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రెండు హై బ్లూ పాములను జత చేసినా వాటి పిల్లలు కూడా నీలం రంగులోనే పుడతారనే గ్యారంటీ ఉండదు. ఎన్నో సంవత్సరాల శ్రమ, భారీ ఖర్చు, చాలా తక్కువ విజయవంతమైన ఫలితాల కారణంగా ఈ పాముల ధర ఆకాశాన్ని తాకుతోంది.

ఫొటో: హై బ్లూ గ్రీన్ ట్రీ ఫైథాన్

ఎక్కడ కనిపిస్తాయి?

హై బ్లూ గ్రీన్ ట్రీ పైథాన్‌లు సహజంగా న్యూగినియా, తూర్పు ఇండోనేషియా, ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాల్లోని దట్టమైన వర్షాధార అడవుల్లో జీవిస్తాయి. ఇవి ఎక్కువ సమయం చెట్ల కొమ్మలపై చుట్టుకుని గడుపుతాయి. చిన్న పక్షులు, బల్లులు, ఎలుకలు వంటి జీవులను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. ఈ గ్రీన్ ట్రీ పైథాన్‌లకు విషం ఉండదు. ఇవి మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. ప్రమాదం అనిపిస్తే మాత్రమే తమను తాము రక్షించుకునేందుకు స్పందిస్తాయి. అందువల్ల విషపూరిత పాములతో పోలిస్తే ఇవి తక్కువ ప్రమాదకరంగా పరిగణిస్తారు.

ఇది కూడా చదవండి: మనమెంతో ఇష్టంగా తినే ఈ చేపలు పిల్లలకు నోటి నుంచి జన్మనిస్తాయా?

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి గ్రీన్ ట్రీ పైథాన్‌కు కోట్ల రూపాయల ధర ఉండదు. సాధారణంగా పెంపకంలో లభించే గ్రీన్ ట్రీ పైథాన్‌ల ధర కొన్ని వందల నుంచి కొన్ని వేల అమెరికన్ డాలర్ల వరకు మాత్రమే ఉంటుంది. అసాధారణమైన జన్యు లక్షణాలు, అరుదైన ‘హై బ్లూ’ రంగు, స్పష్టమైన వంశావళి రికార్డులు ఉన్న కొన్ని ప్రత్యేక పాములు మాత్రమే కోట్ల రూపాయల ధరను అందుకుంటాయి. అరుదైన రంగు, ప్రత్యేక జన్యువులు, క్లిష్టమైన పెంపక విధానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల భారీ డిమాండ్.. ఈ నాలుగు కారణాల వల్ల హై బ్లూ గ్రీన్ ట్రీ పైథాన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాముగా నిలిచింది. అయితే ఇలాంటి జంతువుల కొనుగోలు, విక్రయాలు ఆయా దేశాల వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలకు లోబడి మాత్రమే జరగాల్సి ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us