
వేసవి కాలంలో ఉక్కపోత నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది ఎయిర్ కూలర్లను వాడుతుంటారు. అయితే, కూలర్‌ను సరిగ్గా శుభ్రం చేయకపోతే, దాని నుండి ఒక రకమైన కుళ్ళిన వాసన లేదా తేమతో కూడిన దుర్వాసన వస్తుంటుంది. ఇది కేవలం అసౌకర్యంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా హానికరం. అందుకే, వేసవిలో ఎక్కువగా ఉపయోగించే ఎయిర్ కూలర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం చాలా ముఖ్యం. కూలర్‌లో నిల్వ నీరు, మురికి, అల్గీ పెరగడం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ దుర్వాసనను సులభంగా తొలగించవచ్చు.
దుర్వాసన రావడానికి కారణం ఏమిటి?:
కూలర్‌లోని నీటిని క్రమం తప్పకుండా మార్చకపోవడం వల్ల అందులో బ్యాక్టీరియా, నాచు, క్రిమికీటకాలు చేరుతాయి. అలాగే, కూలింగ్ ప్యాడ్లపై పేరుకుపోయిన ధూళి వల్ల కూడా గాలి దుర్వాసనతో వస్తుంది.
దుర్వాసనను నివారించే మార్గాలు:
నారింజ తొక్కలు: నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి, అందులో కొంచెం దాల్చిన చెక్క పొడి కలిపి కూలర్ నీటిలో వేయాలి లేదా లోపల చల్లాలి. ఇది సహజమైన రూమ్ ఫ్రెషనర్‌లా పనిచేస్తుంది.
వేపాకులు: దుర్వాసనను పోగొట్టడంలో, బ్యాక్టీరియాను చంపడంలో వేపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని వేపాకులను నలిపి ఒక నూలు గుడ్డలో కట్టి, ఆ మూటను కూలర్ నీటి ట్యాంక్‌లో వేయాలి. దీనివల్ల నీరు శుభ్రంగా ఉంటుంది. దోమలు చేరకుండా ఉంటాయి. అయితే, ప్రతి 3-4 రోజులకోసారి ఈ ఆకులను మార్చాలి.
బేకింగ్ సోడా: వంటింట్లో ఉండే బేకింగ్ సోడాను కూలర్ నీటిలో కలిపితే, అది కొన్ని నిమిషాల్లోనే దుర్వాసనను పీల్చుకుంటుంది. ఇది నీటిని ఫ్రెష్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.
ముఖ్యమైన జాగ్రత్త: దుర్వాసన రాకుండా ఉండాలంటే కూలర్‌లోని నీటిని కనీసం వారానికి ఒకసారి మార్చడం చాలా ముఖ్యం. అలాగే కూలింగ్ ప్యాడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల మనకు స్వచ్ఛమైన, చల్లని గాలి అందుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో మీ కూలర్‌ను తాజాగా ఉంచుకోవచ్చు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..