
తేనె అంటే చాలామందికి ఇష్టమైన సహజమైన తీపి పదార్థం. కానీ మనం తినే తేనె వెనుక తేనెటీగల శ్రమ ఎంతో ఉంటుంది. పూల నుంచి తేనెటీగలు సేకరించే తేనెరసం నుంచి తేనె ఎలా తయారవుతుందో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ తేనె తుట్టెను తేనెటీగలు ఎలా నిర్మిస్తాయి? అనే విషయం ఆసక్తికరంగా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తేనె తయారీ ప్రక్రియ పూల దగ్గరే ప్రారంభమవుతుంది. కార్మిక తేనెటీగలు వివిధ పూల నుంచి నెక్టార్ (తేనెరసం)ను తమ పొడవైన నాలుకతో సేకరిస్తాయి. ఈ నెక్టార్‌ను సాధారణంగా తేనెటీగ తన ప్రత్యేకమైన హనీ స్టమక్ (హనీ క్రాప్)లో నిల్వ చేసుకుని తుట్టెకు తీసుకువస్తుంది. ఇది తేనెటీగ ఆహారం జీర్ణమయ్యే సాధారణ కడుపు కాదు. తుట్టెకు చేరుకున్న తర్వాత సేకరించిన నెక్టార్‌ను మరో కార్మిక తేనెటీగకు అందిస్తుంది. ఈ ప్రక్రియలో తేనెటీగల శరీరంలోని కొన్ని ఎంజైమ్‌లు నెక్టార్‌లోని సంక్లిష్ట చక్కెరలను మార్చడం ప్రారంభిస్తాయి. అనంతరం తేనెటీగలు నెక్టార్‌ను తుట్టెలోని చిన్న చిన్న గదుల్లో నిల్వ చేస్తాయి.
అయితే నెక్టార్ అప్పటికీ పూర్తిగా తేనెగా మారదు. అందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే తేనెటీగలు తమ రెక్కలను వేగంగా ఆడిస్తూ గాలి ప్రసరణ కల్పిస్తాయి. దీంతో నెక్టార్‌లోని అదనపు నీరు ఆవిరైపోతుంది. నెక్టార్ చిక్కగా మారి తేనెగా తయారైన తర్వాత, తేనెటీగలు ఆ గదులను పలుచని మైనపు మూతతో మూసివేస్తాయి.
ఇక తేనె తుట్టె నిర్మాణం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. కార్మిక తేనెటీగలు తమ పొట్ట భాగంలోని మైనపు గ్రంథుల నుంచి చిన్న చిన్న మైనపు పలకలను ఉత్పత్తి చేస్తాయి. వాటిని నోటితో నమిలి మెత్తగా చేసి, వరుసగా అమర్చి తుట్టెను నిర్మిస్తాయి. తేనె తుట్టెలోని గదులు ఎక్కువగా షడ్భుజాకారంలో (ఆరు కోణాలతో) ఉంటాయి. ఈ ఆకారం తక్కువ మైనంతో ఎక్కువ నిల్వ స్థలాన్ని కల్పించడమే కాకుండా, తుట్టెను బలంగా ఉంచుతుంది. ఇదే గదుల్లో తేనెను నిల్వ చేయడంతో పాటు, కొన్ని గదులను పిల్ల తేనెటీగల పెంపకానికి కూడా ఉపయోగిస్తారు. అంటే పూల నుంచి నెక్టార్ సేకరించడం నుంచి నీటిని ఆవిరి చేయడం, మైనంతో తుట్టె నిర్మించడం వరకు.. తేనెటీగల సమన్వయంతోనే మనకు సహజమైన తేనె అందుతుంది.