మీ కనకాంబరం మొక్క ఏపుగా పెరిగి.. గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే ఇలా చేయండి.!

కనకాంబరం మొక్కలను ఇంట్లో సులభంగా పెంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఏడాది పొడవునా పూలు పూస్తుంది. మరి అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి. ఆ వివరాలు ఇలా..

మీ కనకాంబరం మొక్క ఏపుగా పెరిగి.. గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే ఇలా చేయండి.!
Crossandra

Updated on: May 09, 2026 | 1:52 PM

తెలుగువారి ఇంటి తోటల్లో తప్పనిసరిగా కనిపించే పూల మొక్కల్లో కనకాంబరం ఒకటి. ఇంగ్లీష్‌లో ‘క్రొసాండ్రా’ అని పిలిచే ఈ మొక్క, తన విలక్షణమైన రంగులతో ఏడాది పొడవునా కళ్లకు విందు చేస్తుంది. ముఖ్యంగా మార్చి నెలలో మొదలై నవంబర్ వరకు ఈ మొక్క విపరీతంగా పూలు పూస్తుంది. నర్సరీల్లో మనకు నారింజ, పసుపు, ఎరుపు, పింక్ వంటి రకరకాల రంగుల్లో ఇవి దొరుకుతుంటాయి. అయితే, చాలామంది ఇంట్లో కనకాంబరం మొక్కలు పెంచుతున్నా, అవి ఆశించిన స్థాయిలో పూయవు. మీ మొక్క కూడా పూలతో నిండిపోవాలంటే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు, సంరక్షణ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది.

ఇది చదవండి: పొలానికి వెళ్లిన రైతుకు దూరంగా ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా.. ఆశ్చర్యంగా.!

మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే మనం ఇచ్చే మట్టి మిశ్రమం చాలా కీలకం. నర్సరీ నుండి తెచ్చిన మొక్కను రీపాటింగ్ చేసేటప్పుడు 40 శాతం గార్డెన్ సాయిల్, 30 శాతం కంపోస్ట్, మరో 30 శాతం ఇసుక కలిపిన మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇసుక కలపడం వల్ల మట్టి లూస్‌గా ఉండి, నీరు నిలవకుండా డ్రైనేజీ హోల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల వేర్లు కుళ్ళిపోకుండా మొక్క ఏపుగా పెరుగుతుంది. ఎండ విషయానికి వస్తే, కనకాంబరానికి మరీ తీవ్రమైన వేడి పడదు. ఉదయం పూట వచ్చే 4-5 గంటల లేత ఎండ ఈ మొక్కకు అమృతంలా పనిచేస్తుంది. అందుకే బాల్కనీల్లో పెంచే వారికి ఇవి బాగా పూస్తాయి. టెర్రస్ మీద పెంచేవారు వేసవిలో రోజంతా ఎండ తగలకుండా కాస్త నీడ ఉండేలా చూసుకోవాలి, లేదంటే మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, పూలు వాడిపోయిన తర్వాత ఆ గుత్తులను అలాగే ఉంచేస్తారు. మొక్క నిండా పూలు రావాలంటే వాడిపోయిన పూలగుత్తులను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొక్క తన శక్తిని విత్తనాల తయారీకి కాకుండా, కొత్త మొగ్గలు వేయడానికి ఉపయోగిస్తుంది. మీకు విత్తనాలు కావాలనుకుంటేనే వాటిని పూర్తిగా ఎండిపోయే వరకు మొక్కపై ఉంచండి. నారింజ రంగు సౌందర్య కనకాంబరానికి విత్తనాలు వస్తాయి కానీ, పసుపు రంగు రకానికి సాధారణంగా విత్తనాలు ఉండవు.

మొక్కకు అవసరమైన పోషకాలను అందించడంలో సహజమైన ఎరువులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లోనే తయారు చేసుకునే అరటిపండు తొక్కల ద్రావణం లేదా ఉల్లిపాయ తొక్కల నీరు కనకాంబరానికి చాలా మంచిది. వీటిలో ఉండే పొటాషియం పూలు విరగబూయడానికి సహకరిస్తుంది. అరటి తొక్కలను లేదా ఉల్లిపాయ తొక్కలను రెండు రోజులు నీటిలో నానబెట్టి, ఆ నీటిని వారానికి ఒకసారి మొక్క మొదట్లో పోయాలి. ఉల్లిపాయ తొక్కల నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కలిపితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. రసాయనిక ఎరువులు వాడే అలవాటు ఉంటే, ప్రతి 20 రోజులకు ఒకసారి కొద్దిగా డీఏపీ, రెడ్ పొటాష్ అందిస్తే పూల సైజు, రంగు ఆకట్టుకునేలా ఉంటాయి. నెలకు ఒకసారి గుప్పెడు వర్మీ కంపోస్ట్ వేస్తే ఆకులు ముదురు ఆకుపచ్చగా, ఆరోగ్యంగా మెరుస్తాయి.

కొత్త మొక్కలను తయారు చేసుకోవడం కూడా ఈ మొక్క విషయంలో చాలా సులభం. ఆగస్ట్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో చిన్న చిన్న కొమ్మలను తుంపి నాటితే అవి త్వరగా వేర్లు తొడుగుతాయి. సగం ఎదిగిన కొమ్మలను తీసుకుని ఇసుక లేదా కోకోపీట్‌లో నాటి, నీడలో ఉంచితే కొద్ది రోజుల్లోనే కొత్త మొక్కలు సిద్ధమవుతాయి. ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు, మీ ఇంటి తోటలో కనకాంబరాలు ఏడాది పొడవునా రంగురంగుల పూల గుత్తులతో కళకళలాడుతూనే ఉంటాయి.

ఇది చదవండి: మీ ఇంటిలో గులాబీలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే..? ఇది ఒక్కటి వేస్తే వద్దన్నా పూస్తాయ్..

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us