COVID Vaccine: కరోనా మహమ్మారి పీచమణిచేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయితే, వ్యాక్సిన్ తీసుకునే వారికోసం వైద్యాధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునేవారు అనుసరించాల్సిన పద్ధతులు, పాటించాల్సిన జాగ్రత్తల గురించి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక సందేహం అందరినీ వేధిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు మద్యం సేవించవచ్చా? ఒకవేళ సేవించవచ్చంటే ఎన్నో రోజుల తరువాత సేవించవచ్చు? వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మద్యం సేవిస్తే కలిగే దుష్ప్రభావాలేంటి? వంటి సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు ఈ అంశాలన్నింటిపై క్లారిటీ ఇచ్చారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత 45 రోజుల వరకూ ఎలాంటి మద్యం సేవించరాదని, ఒకవేళ తాగితే టీకా సామర్థ్యం తగ్గుతుందని పలువురు నిపుణులు వాదిస్తున్నారు. మద్యం సేవించడం వల్ల అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దుష్ప్రభావాలకు గురిచేస్తుందంటున్నారు. అయితే, ఈ వాదనలు శాస్త్రీయంగా నిరూపించబడలేదు. ఆల్కాహాల్ కొవిడ్19 వ్యాక్సిన్ ప్రభావాన్ని తగ్గిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. డబ్ల్యూహెచ్ఓ, సీడీసీ, ఇతర ఏ మెడికల్ సంస్థలూ దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. టీకా వేసుకోవడం ద్వారా శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయి భవిష్యత్‌లో ఎలాంటి వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించినా తట్టుకునే శక్తిని ఇస్తాయి. అయితే ఆల్కాహాల్ తీసుకోవడం ద్వారా ఈ యాంటీబాడీస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని అంటున్నారు మరికొందరు నిపుణులు. వీరి వాదనకు కారణం.. ఇప్పటి వరకూ ఏ ఆరోగ్య సంస్థ కూడా దీనిని నిరూపించకపోవడమే. అందువల్ల టీకా తీసుకున్న ప్రజలు మద్యం సేవించడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. మద్యం సేవించడం ద్వారా ప్రయోజనమా? దుష్ప్రభావమా? అనేది పక్కనబెడితే.. టీకా తీసుకునే వారు పాటించాల్సిన మార్గదర్శాలను అనుసరిస్తే లబ్ధిదారులు మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీకా ప్రభావాన్ని ఆల్కాహాల్ తగ్గిస్తుందని నిరూపణలు లేనప్పటికీ.. ఆల్కాహాల్ అనేది మనిషి రోగ నిరోధక శక్తి పనితీరును ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారణంగానే వైద్యులు టీకా తీసుకున్న లబ్ధిదారులు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. వ్యాక్సిన్ ఇచ్చాక.. శరీరంలో తగినన్ని యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడానికి 3 వారాల సమయం పడుతుందని, అందుకే ఆ సమయంలో మద్యం సేవించకపోవడమే మంచిందని చెబుతున్నారు.
ఇక రష్యా తయారీ వ్యాక్సిన్ అయిన స్పుత్నిక్ V వినియోగానికి సంబంధించిన సిఫారసులో మద్యం తాగొద్దని పేర్కొన్నారు. టీకా తీసుకున్న తరువాత మద్యం సేవిస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దాంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇతర టీకాలు మాత్రం పరిమిత మొతాదులో మద్యపానం తీసుకోవడం ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుందని వాటి వాటి మార్గదర్శకాల్లో పేర్కొన్నాయి.
టీకా తీసుకున్న తరువాత శరీరానికి విశ్రాంతి చాలా అవసరం..
ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. టీకా తీసుకున్న తరువాత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ షాట్ తీసుకున్న తరువాత శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిదంటున్నారు. దీనివల్ల దుష్ప్రభావాలు తగ్గడానికి అవకాశం లభిస్తుందంటున్నారు. అతిగా మద్యం సేవించడం వల్ల ఒత్తిడి పెరుగుతుందంటున్నా. టీకా తీసుకున్న తరువాత మద్యం సేవించే వారు హ్యాంగోవర్‌కు గురవుతారు. అయితే, కొంతమందికి హ్యాంగోవర్ లక్షణాలకు, టీకా దుష్ప్రభావాలకు మధ్య తేడాను గుర్తించలేరని నిపుణులు చెబుతున్నారు. అందుకే మద్యం సేవించడంలో కాస్త విచక్షణ పాటిస్తే మంచిదని హితవుచెబుతున్నారు.
మద్యం అధికంగా సేవిస్తే ఏం జరుగుతుంది?
అతిగా మద్యపానం చేయడం వల్ల వ్యాక్సి్న్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు కలుగుతాయనే అంశంలో అధికారిక రుజులు లేనప్పటికీ.. అధిక మద్యపానం శరీరానికి మంచి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగా జాగ్రత్తగా ఉంటే మంచిందని సూచిస్తున్నారు. ఆల్కహాల్ వాడకం కాలేయ సంబంధిత వ్యాధులు, ఒత్తిడి, కొమొర్బిడిటీ వంటి వాటితో ముడిపడి ఉందని, ఆరోగ్య క్షీణతకు దారి తీస్తుందని చెబుతున్నారు.
టీకా తీసుకున్న తరువాత సురిక్షితంగా ఉండేందుకు ఏం చేయాలి?
కొవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తరువాత మద్యం సేవించాలని భావిస్తే.. మితంగా సేవించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదికాక.. తగినంత విశ్రాంతి తీసుకుంటే మరీ మంచిది. ఒత్తిడి కూడిన పనులు చేపట్టకండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అన్నికంటే ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటించండి. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి.
Also read:
ల్యాప్ టాప్, మొబైల్‌ను పురుషులు ఇలా వాడుతున్నారా… అయితే ముప్పుతప్పదని హెచ్చరిస్తున్న వైద్యులు
సింధియా కాంగ్రెస్‌లో ఉంటే సీఎం అయ్యేవారు.. ఇప్పుడు బ్యాక్ బెంచర్‌గా మారారు: రాహుల్ గాంధీ