అప్పట్లో లంకె బిందెలు భూమిలోనే ఎందుకు దాచేవారు? సామాన్యులే కాదు, రాజులు అలానే ఎందుకు చేశారు?

ప్రాచీన కాలంలో ప్రజలు తమ బంగారం, నిధులు భూమిలో దాచేవారు. బ్యాంకులు, లాకర్లు లేకపోవడం, యుద్ధాలు, దొంగల భయం వంటి కారణాలతో ఇది సంపదను కాపాడుకునే అత్యంత సురక్షిత మార్గంగా భావించారు. మరణించినవారు లేదా వలస వెళ్ళినవారు వదిలివెళ్ళిన అనేక నిధులు నేటికీ తవ్వకాల్లో బయటపడుతున్నాయి.

అప్పట్లో లంకె బిందెలు భూమిలోనే ఎందుకు దాచేవారు? సామాన్యులే కాదు, రాజులు అలానే ఎందుకు చేశారు?
Lanke Bindelu

Updated on: Jul 07, 2026 | 8:11 PM

తవ్వకాల్లో బయటపడ్డ భారీ నిధి, లంకె బిందెల కోసం రహస్య తవ్వకాలు.. ఇలాంటి వార్తలు మనం అప్పుడప్పుడు పత్రికల్లో చదువుతూ, వార్తల్లో వింటూ చూస్తూ ఉంటాం కదా. అసలు ఇలాంటి నిధులు, లంకె బిందెలు, బంగారం తవ్వకాల్లోనే ఎందుకు బయటపడుతుంది? సింపుల్.. ప్రాచీనకాలంలో వాటిని భూమిలో పాతిపెట్టి ఉంచారు కనుక ఇప్పుడు తవ్వకాల్లో బయటపడుతున్నాయి. అయితే అసలు పాతకాలంలో సామాన్యులే కాదు రాజులు, పెద్ద పెద్ద వ్యాపారస్థులు కూడా తమ వద్ద ఉన్న సంపదను, బంగారం, వజ్రాలు, ఇతర నిధులను భూమిలో పాతిపెట్టి దాచేశారు. కానీ, అలా ఎందుకు చేసేవారు అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా?

ఇది కూడా చదవండి: ఫ్రీగా ఇచ్చినా ఎందుకు తినరు! మన చెరువుల్లో దొరికే ఈ దెయ్యం చేప గురించి తెలుసా?

ప్రాచీన కాలంలో బంగారం, వజ్రాలు వంటి నిధులను భూమిలో పాతిపెట్టిన కథలు నిజంగానే కథలు కాదు, పైగా మూఢనమ్మకాలు అసలు కానే కాదు. అది నిజమే. కానీ అలా ఎందుకు చేసేవారన్నదే అసలు ప్రశ్న. దానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అప్పటి పరిస్థితుల్లో అది సంపదను కాపాడుకునే అత్యంత సురక్షితమైన మార్గంగా భావించేవారు. ఇప్పుడంటే మనకు బ్యాంకులు, లాకర్లు ఉన్నాయి కానీ అప్పుట్లో అవి ఎక్కడవి. సో.. రాజులు, వ్యాపారులు, ధనిక కుటుంబాలు తమ బంగారు నాణేలు, వెండి, ఆభరణాలు వంటి విలువైన వస్తువులను మట్టి కుండలు లేదా చెక్క పెట్టెల్లో పెట్టి భూమిలో పాతిపెట్టేవారు. తోటలు, పొలాలు, బావుల పరిసరాలు, రహస్య గదులు వంటి ఎవరూ అనుమానించని ప్రదేశాలను ఇందుకోసం ఎంపిక చేసేవారు.

యుద్ధాల భయంతో..

ఆ కాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు, విదేశీ దండయాత్రలు తరచూ జరిగేవి. శత్రువుల చేతికి సంపద చిక్కకుండా ఉండేందుకు ప్రజలు తమ ఆస్తిని భూమిలో పాతిపెట్టేవారు. యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి తీసుకోవాలని భావించినా, యుద్ధాల్లో మరణించడం లేదా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం వల్ల ఆ నిధులు శాశ్వతంగా భూమిలోనే మిగిలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

దొంగల నుంచి రక్షణ

ఆ రోజుల్లో ఆధునిక పోలీసు వ్యవస్థ లేదా భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఇంట్లో బంగారం, వెండి నిల్వ ఉంచడం ప్రమాదకరంగా ఉండేది. దొంగల భయంతో చాలామంది తమ విలువైన వస్తువులను భూమిలో పాతిపెట్టడం ద్వారా రక్షించుకునేవారు. అప్పటి పరిస్థితుల్లో ఇదే అత్యంత సురక్షితమైన మార్గంగా భావించేవారు. అలాగే చాలా సందర్భాల్లో నిధిని పాతిపెట్టిన వ్యక్తి యుద్ధం, వ్యాధి లేదా ఇతర కారణాలతో అకస్మాత్తుగా మరణించేవాడు. నిధి ఎక్కడ దాచారనే విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో ఆ సంపద తరతరాల పాటు భూమిలోనే ఉండిపోయింది. నేటికీ పురావస్తు తవ్వకాలలో వెలుగులోకి వచ్చే అనేక నిధులు ఇలాంటి పరిస్థితుల ఫలితమే.

ఇది కూడా చదవండి: ఫ్రీగా ఇచ్చినా ఎందుకు తినరు! మన చెరువుల్లో దొరికే ఈ దెయ్యం చేప గురించి తెలుసా?

ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది?

భూమిలో నిధులు దాచే సంప్రదాయం ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల కాలం నుంచే కొనసాగుతోంది. ఈజిప్ట్, మెసొపొటేమియా, సింధు లోయ నాగరికతల ప్రజలు మరణానంతరం కూడా జీవితం ఉంటుందని విశ్వసించేవారు. అందుకే రాజులు, ధనికులను బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఖననం చేసేవారు. అవి పరలోక జీవితంలో ఉపయోగపడతాయని నమ్మకం ఉండేది. క్రీ.పూ.6వ శతాబ్దం నుంచి లోహపు నాణేల వినియోగం పెరగడంతో సంపదను మట్టి కుండల్లో నిల్వ చేసి భూమిలో పాతిపెట్టే పద్ధతి మరింత విస్తరించింది. గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలతో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఆచారం కనిపిస్తుంది. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలలో కనుగొనే నాణేల కుండలు ఈ చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

Follow Us