మూత్రంలో తీపి వాసనతో పాటు ఈ లక్షణాలు ఉంటే.. ఆ వ్యాధి ఉన్నట్లే..!

మూత్రంలో తీపి వాసన రావడం సాధారణం కాదు. ఇది ముఖ్యంగా మధుమేహం, డయాబెటిక్ వంటి సమస్యలకు సంకేతంగా ఉండవచ్చు. ఇలాంటి మార్పులు గమనించినప్పుడు వాటిని లైట్‌ గా తీసుకోకుండా.. వెంటనే పరీక్షలు చేయించుకోండి. వైద్యులను సంప్రదించడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

మూత్రంలో తీపి వాసనతో పాటు ఈ లక్షణాలు ఉంటే.. ఆ వ్యాధి ఉన్నట్లే..!
Why Your Urine Smells Like Fruit

Updated on: Jul 01, 2025 | 3:14 PM

మూత్రం నుంచి తీపి వాసన వస్తోందని మీరు ఎప్పుడైనా గమనించారా..? ఇది సాధారణం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడం మీ ఆరోగ్య పరిరక్షణలో చాలా ముఖ్యమైనది. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తీపి వాసన ఎందుకు వస్తుంది..?

మూత్రం నుంచి తీపి లేదా పండ్లలాంటి వాసన వస్తే.. అది సాధారణంగా శరీరంలో ఏదో ఒక మార్పు జరుగుతోందని సూచిస్తుంది. ముఖ్యంగా మధుమేహం సరిగా నియంత్రణలో లేనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగిపోతాయి. ఈ అధిక చక్కెరను శరీరం బయటకు పంపే ప్రయత్నంలో మూత్రం ద్వారా విసర్జిస్తుంది. దీనివల్ల మూత్రంలో తీపి వాసన వస్తుంది. ఇది చాలా సందర్భాలలో డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మధుమేహం అదుపులో లేనప్పుడు శరీరం శక్తి కోసం కొవ్వును వినియోగించుకోవడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియలో కీటోన్లు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఇవి కూడా మూత్రం ద్వారా బయటకు వెళ్లేటప్పుడు తీపి వాసనకు కారణమవుతాయి. ఇది డయాబెటిక్ కీటోఆసిడోసిస్ (DKA) అనే తీవ్రమైన పరిస్థితిని సూచించవచ్చు. ఇది తక్షణ వైద్య సహాయం అవసరమైన అత్యవసర స్థితి.

హెచ్చరిక లక్షణాలేంటి..?

  • మూత్రానికి తీపి లేదా పండ్లలాంటి వాసన
  • మితిమీరిన దాహం
  • తరచూ మూత్రం పోవడం
  • సాధారణం కన్నా అధిక అలసట
  • అకస్మాత్తుగా బరువు తగ్గడం
  • మానసిక గందరగోళం
  • శరీర ఉష్ణోగ్రత పెరగడం

సరైన సమయంలో పరీక్షలు

ఇలాంటి సమస్యలను తొందరగా గుర్తిస్తే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలని నివారించవచ్చు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల తీవ్రమైన పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి..?

మీ మూత్రంలో తీపి లేదా భిన్నమైన వాసనతో పాటు.. కడుపు లేదా వెన్నునొప్పి, మూత్రంలో రక్తం, అధిక జ్వరం, గందరగోళం, అలసట వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

వీటిని తేలికగా తీసుకోవద్దు

మూత్రంలో మార్పులు చిన్న విషయంగా అనిపించినా.. అవి చాలా పెద్ద ఆరోగ్య సమస్యల సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా తీపి వాసన ఉన్న మూత్రం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను గుర్తించేందుకు సహాయపడుతుంది. మీరు ఇలాంటి లక్షణాలను గమనిస్తే ఆలస్యం చేయకుండా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.