
లివర్ మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం, ఆహారాన్ని జీర్ణించడానికి సహాయపడే జీర్ణక్రియకు అవసరమైన ద్రవాన్ని ఉత్పత్తి చేయడం, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడం వంటి అనేక ముఖ్యమైన పనులు చేస్తుంది. అలాంటి లివర్ ని ఆరోగ్యంగా ఉంచేందుకు జీవన విధానం, ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. ఇప్పుడు మనం లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.
నిమ్మకాయలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ఇది కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిత్యం ఈ అలవాటు లివర్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది.
ఆరెంజ్ లో విటమిన్ సి, ఫ్లావనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
ఆరెంజ్ ను రోజూ తినడం వల్ల కాలేయంలో ఉండే హానికర రసాయనాలను తొలగించడంలో సహాయమవుతుంది. ఇది కాలేయాన్ని ఉత్తమ స్థితిలో ఉంచుతుంది.
ద్రాక్షలో రెస్వెరట్రాల్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉండటం వలన ఇది కాలేయాన్ని రక్షిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. నల్ల ద్రాక్ష ప్రత్యేకంగా లివర్ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
యాపిల్ లోని ఫైబర్ కాలేయంలో నిల్వయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
బ్రోమెలైన్ అనే సహజ ఎంజైమ్ పైనాపిల్లో ఉంటుంది. ఇది శరీరంలోని వాపు సమస్యలను తగ్గించడంలో సహకరిస్తుంది. కాలేయంపై ఒత్తిడి తగ్గించి దాని పనితీరును మెరుగుపరచడంలో ఈ పండు ఉపయోగపడుతుంది.
బొప్పాయిలో పపైన్ అనే ముఖ్యమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కాలేయాన్ని శుభ్రంగా ఉంచడానికి.. దాని ఆరోగ్యాన్ని నిలుపుకోవడానికి ఇది మంచిగా పనిచేస్తుంది.
వేసవి రోజులలో అందరికీ ఇష్టమైన మామిడిపండులో విటమిన్ ఎ, సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని రక్షించడంలో, శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. మామిడి మితంగా తీసుకుంటే శరీరానికి మంచి లాభాలు ఉంటాయి.
పుచ్చకాయలో అధికంగా నీరు ఉండటం వలన ఇది శరీరానికి తేమనిస్తుంది. అలాగే ఇందులో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన కాలేయాన్ని హానికరమైన పదార్థాల నుండి రక్షిస్తుంది. వేసవిలో ఇది లివర్‌కు చల్లదనం కలిగించే శ్రేష్ఠమైన పండు.
కివీలో విటమిన్ సి మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కివీ పండును ఆహారంలో చేర్చుకుంటే కాలేయానికి మేలు కలుగుతుంది.
ఈ పండ్లను మన రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఉండే సహజ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లాంటి పదార్థాలు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)