
మన శరీరానికి ఆధారంగా నిలిచే వెన్నెముక, మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు సంకేతాలను చేరవేసే నరాలకు రక్షణ కల్పిస్తుంది. అందువల్ల వెన్ను లేదా మెడ ప్రాంతంలో నొప్పితో పాటు చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. రేడియాలజిస్ట్ డాక్టర్ హర్ష్ మహాజన్ వివరించిన అంశాల ఆధారంగా, వెన్నెముక సమస్యలను సూచించే ఐదు ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం.
పని ఎక్కువైనప్పుడు, ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్నప్పుడు వీపు లేదా మెడ నొప్పి రావచ్చు. అయితే విశ్రాంతి తీసుకున్నప్పటికీ నొప్పి తగ్గకపోవడం, కొన్ని వారాలుగా కొనసాగడం లేదా తగ్గినట్టే తగ్గి మళ్లీ రావడం వంటివి ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. నొప్పి కారణంగా రాత్రిపూట నిద్ర పట్టకపోయినా, సాధారణ పనులు చేసుకోలేకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు.
నొప్పి ఎందుకు వస్తోందో తెలుసుకోకుండా సొంతంగా పదేపదే నొప్పి నివారణ మందులు వాడటం సరైన పద్ధతి కాదు. నొప్పి తీవ్రత, దాని వ్యవధి, ఇతర లక్షణాలను బట్టి వైద్యుడు తగిన పరీక్షలు, చికిత్సను సూచించవచ్చు.
నడుము దగ్గర మొదలైన నొప్పి కాళ్లలోకి పాకడం లేదా మెడ నుంచి భుజాలు, చేతుల వరకు వ్యాపించడం కొన్నిసార్లు నరాలపై ఒత్తిడి ఉన్నట్లు సూచించవచ్చు. దీనితో పాటు సూదులతో గుచ్చినట్లు అనిపించడం, మంట, తిమ్మిర్లు లేదా శరీరంలోని కొన్ని భాగాల్లో స్పర్శ సరిగ్గా తెలియకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.
ఈ సమస్యలు తరచుగా వస్తున్నా, ఎక్కువసేపు కొనసాగుతున్నా వైద్య పరీక్ష అవసరం. ముఖ్యంగా నొప్పితో పాటు స్పర్శలో మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
చేతులతో వస్తువులను గట్టిగా పట్టుకోలేకపోవడం, చిన్న వస్తువులు తరచూ చేతిలో నుంచి జారిపోవడం, కాళ్లలో బలం తగ్గినట్లు అనిపించడం లేదా నడుస్తున్నప్పుడు తడబడటం వంటి మార్పులను గమనించాలి. ఇవి కేవలం అలసట వల్లే వస్తాయని భావించి నిర్లక్ష్యం చేయడం సరికాదు. కొన్ని సందర్భాల్లో నరాలపై ఒత్తిడి కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు.
వెన్ను లేదా మెడ నొప్పితో పాటు చేతులు, కాళ్ల బలహీనత కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. బలహీనత కొత్తగా మొదలైనా, వేగంగా పెరుగుతున్నా అత్యవసరంగా పరీక్ష చేయించుకోవాలి.
వెన్నునొప్పితో పాటు జ్వరం రావడం, ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం లేదా రాత్రివేళల్లోనూ నిరంతరంగా నొప్పి వేధించడం వంటి లక్షణాలను గమనించాలి. ముఖ్యంగా గతంలో క్యాన్సర్ ఉన్నవారు, ఇటీవల తీవ్రమైన ఇన్ఫెక్షన్కు గురైనవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఇలాంటి లక్షణాలకు అనేక కారణాలు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో వెన్నెముకకు సంబంధించిన ఇన్ఫెక్షన్, ఎముకలో పగులు లేదా అరుదుగా కణితి వంటి సమస్యలను పరిశీలించాల్సి రావచ్చు. అందుకే నొప్పితో పాటు ఇతర అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యుడి సలహా తీసుకోవడం ముఖ్యం.
రోడ్డు ప్రమాదం, ఎత్తు నుంచి పడిపోవడం లేదా బలమైన దెబ్బ తగిలిన తర్వాత వెన్నునొప్పి మొదలైతే తప్పనిసరిగా వైద్య పరీక్ష చేయించుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, ఎముకలు బలహీనపడే ఆస్టియోపొరోసిస్ సమస్య ఉన్నవారిలో చిన్న గాయం తర్వాత కూడా ఎముకకు పగులు ఏర్పడే అవకాశం ఉంటుంది.
అలాగే మూత్ర విసర్జన చేయడంలో కొత్తగా ఇబ్బంది కలగడం, మూత్రం లేదా మలంపై నియంత్రణ కోల్పోవడం, గజ్జలు లేదా జననాంగాల చుట్టూ స్పర్శ తగ్గడం, కాళ్లలో తీవ్రమైన బలహీనత రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. ఇవి వెన్నెముక దిగువ భాగంలోని నరాల సమూహంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించే కాడ ఈక్వినా సిండ్రోమ్‌కు సంకేతాలు కావచ్చు. ఈ పరిస్థితిలో చికిత్స ఆలస్యం అయితే శాశ్వత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.
కూర్చునే సమయంలో శరీర భంగిమపై శ్రద్ధ పెట్టడం, ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉండకుండా మధ్యమధ్యలో లేచి కదలడం, బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు సరైన పద్ధతిని పాటించడం వంటి అలవాట్లు వెన్నుపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. శరీరానికి సరిపోయే వ్యాయామాలు చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇప్పటికే నొప్పి లేదా నరాలకు సంబంధించిన లక్షణాలు ఉంటే వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే తగిన వ్యాయామాలను ఎంచుకోవాలి.
వెన్నునొప్పి వచ్చిన ప్రతిసారీ అది తీవ్రమైన సమస్య అని భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో నొప్పి నిరంతరంగా ఉండటం, ఇతర లక్షణాలు తోడవడం లేదా కదలికల్లో మార్పులు రావడం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మూత్రం, మల నియంత్రణలో మార్పులు, గజ్జల చుట్టూ తిమ్మిర్లు లేదా అకస్మాత్తుగా తీవ్రమైన బలహీనత ఏర్పడితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిర్ధారణకు లేదా వ్యక్తిగత చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. నొప్పి కొనసాగినా, తీవ్రమైనా లేదా ప్రమాద సంకేతాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించండి.