మన ఆరోగ్యాన్ని కాపాడడంలో పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే కూరగాయలు కూడా మన శరీరానికి కావలసిన పోషకాలను సరిపడిన మోతాదులో అందించి మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం పండ్లు, కూరగాయలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. అయితే ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా ఆహారం తీసుకోవడానికి సమయం, ఆహార నియమాలు లేకుండా పోతున్నాయి. ఆ కారణంగానే మనలో చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక వారి ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో ముఖ్యంగా పరకడుపున తినకూడదు. అలా చేయని పక్షంలో జీవక్రియలు మందగించిపోవడం, జీర్ణసంబంధ సమస్యలు వస్తుంటాయి.
అయితే సాధారణంగా ఉదయాన్నే లేచిన వెంటనే మనకు ఏ పని చేయబుద్ది కాదు. అందుకే ఆ రోజు మొత్తం మనం యాక్టివ్గా ఉండాలంటే.. కచ్చితంగా టిఫిన్లో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. వాటితో పాటు కొన్ని కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టాలని పేర్కొంటున్నారు. మరి వారి సూచనల ప్రకారం ఉదయాన్నే తినకూడని ఆహార పదార్థాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సిట్రస్ జాతి పండ్లు: నారింజ, ద్రాక్షపండ్ల వంటి సిట్రస్ జాతి పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్, ఫ్రక్టోజ్ జీవక్రియలను నెమ్మదించేలా చేస్తాయి. అలాగే, కడుపు సమస్యలు, గుండెల్లో మంటను కలిగిస్తాయి. సిట్రస్ పండ్లు చర్మానికి చాలా ఆరోగ్యకరమైనవి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకుండా చూసుకోవాలి.
స్పైసీ ఫుడ్స్: ఉదయం పూట స్పైసీ ఫుడ్స్, మిరపకాయలు తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అవి కడుపులో ఆమ్ల ప్రతిచర్యలు, తిమ్మిర్లను కలిగిస్తాయి. అలాగే, రోజంతా ఆరోగ్యాన్ని ఇబ్బందికరంగా తయారు చేస్తుంది.
స్వీట్స్: ఉదయం నిద్ర లేవగానే వెంటనే చాక్లెట్లను తినకుండా చూసుకోవాలి. వీటిలో చక్కెర కంటెంట్ ఇన్సులిన్ స్థాయిలను వెంటనే పెరిగేలా చేస్తుంది. తర్వాతి రోజుల్లో ప్యాంక్రియాస్కు హాని కలిగిస్తుంది. స్వీట్స్ కాకుండా ఇతర చక్కెర ఆహారాలను కూడా దూరం పెట్టాలి.
ఎరేటెడ్ డ్రింక్స్: ఉదయాన్నే సోడా వంటి ఎరేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. అదనంగా కడుపుకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. శ్లేష్మ పొరను దెబ్బతీస్తుంది. సోడాలను దూరం పెట్టి ఆరోగ్యానికి పనికొచ్చే గ్రీన్ టీ వంటి పానీయాలను తీసుకోవాలి.
కూరగాయలు: క్యారెట్ వంటి పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినకుండా చూసుకోవాలి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే కడుపులో సమస్యలను కలిగిస్తుంది. అపానవాయువు, వికారం, గ్యాస్, కడుపు నొప్పికి కూడా దారితీస్తుంది. కాబట్టి డైటింగ్ చేస్తున్నప్పటికీ ఉదయాన్నే పచ్చి కూరగాయలతో కూడిన సలాడ్లను తినకుండా చూసుకోవాలి.
కూల్ డ్రింక్స్: ఐస్డ్ టీ లేదా కాఫీ వంటి శీతల పానీయాలు తాగడం ద్వారా రోజును ప్రారంభించడం మానుకోవడం ఉత్తమం. ఎందుకంటే అవి రోజంతా మనల్ని మత్తుగా ఉంచుతాయి. శ్లేష్మ పొరను కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకునేందుకు గోరువెచ్చని పానీయం తీసుకోవడం శ్రేయస్కరం.
కాఫీ: కాఫీప్రియులు ఉదయం పూట తమకెంతో ఇష్టమైన పానీయం తాగడం తప్పనిసరిగా మానుకోవాలి. ఉదయం పూట కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ ఏర్పడి కడుపు ఉబ్బరం, వాంతులు అవుతాయి. కాఫీ తీసుకునే ముందు ఏదైనా తినడం చాలా మంచిది.
అరటిపండ్లు: అరటిపండ్లు చాలా ఆరోగ్యకరమైనవి. అయినప్పటికీ వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అరటిపండ్లలో ఉండే మెగ్నీషియం శరీరంలో రక్త స్థాయిలను పెంచడంతోపాటు గుండె సమస్యలకు దారితీస్తుంది.
పులియబెట్టిన పాల ఉత్పత్తులు: పెరుగు వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులను ఖాళీ కడుపుతో తినకుండా చూడాలి. ఇవి జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఎక్కువ ప్రయోజనాలు కలగాలంటే మాత్రం ఇతర ఆహారాలు తీసుకొన్న తర్వాతనే వీటిని తినాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…