వయసుతో సంబంధం లేకుండా వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు.. జీవనశైలితో అనేకానేక కొత్తకొత్త జబ్బులు మనిషిని ఆవరిస్తున్నాయి. చిన్న, పెద్ద తేడా లేదు.. పేద, ధనిక తారతమ్యం లేదు. వయస్సుతో నిమిత్తం లేదు. అందరు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈక్రమంలో ‘డై హార్డ్’ (Die-Hard) సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్న హాలీవుడ్ దిగ్గజ నటుడు బ్రూస్ విల్లిస్ (67) చికిత్స లేని ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా వ్యాధి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు గురువారం వెల్లడించారు. ఆయన భార్య ఎమ్మా, మాజీ భార్య, ప్రముఖ నటి డెమీ మూర్, ఆయన ఐదుగురు కుమార్తెలు ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికైనా వ్యాధి నిర్ధారణ అయినందుకు కాస్త ఉపశమనం కలిగిందని వారు దానిలో పేర్కొన్నారు.
1980, 90 దశకాల్లో బ్రూస్ విల్స్ గొప్ప స్టార్‌గా వెలిగారు. డై హార్డ్, సిక్స్త్ సెన్స్, ఆర్మగెడాన్, పల్ప్ ఫిక్షన్ లాంటి సినిమాలతో ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు. అయిదు సార్లు అతను గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యాడు. రెండు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్నారు. మూన్‌లైటింగ్ ఫిల్మ్ కోసం అతని గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.
బ్రూస్ విల్లీస్‌కు వచ్చిన ‘ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా’ వ్యాధి మెదడును ప్రభావితం చేస్తుందని నిపుణులు వెల్లడించారు. ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో వ్యక్తిత్వం, భావోద్వేగాలు, ప్రవర్తన, ప్రసంగం సరిగా ఉండవని తెలిపారు. ఈ రుగ్మతల వల్ల మెదడు కణాల పనితీరును కోల్పోతుంది. దీంతో వీళ్లు సరిగా మాట్లాడలేరు.. అర్థం చేసుకోలేరు. మెదడు కణాల్లో అసాధారణ రీతిలో ప్రోటీన్లు పేరుకుపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా మెదడులోని ఫ్రాంటల్, టెంపోరల్ భాగాలు క్రమంగా కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయని వివరిస్తున్నారు.
ప్రస్తుతానికి ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా వ్యాధికి ఎటువంటి చికిత్సా లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది వైద్య నిపుణులు దీనికి కొన్ని మందులను సిఫారసు చేస్తున్నారు. యాంటిడిప్రెసెంట్స్ ఆందోళనను తగ్గించడంతో పాటు తీవ్రమైన ప్రవర్తనను నియంత్రించడంలో ఇవి ఉపకరిస్తాయి. ఇదిలా ఉండగా బ్రూస్ విల్లీస్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని చాలా మంది సెలెబ్రిటీలు, అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..