
ఆహారం పాడవకుండా, ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు కంపెనీలు వాడే కొన్ని కెమికల్స్.. నిశ్శబ్దంగా మన శరీరంలో క్యాన్సర్ కణాలను పెంచుతున్నాయని తాజా అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్‌లకు ఈ నిల్వ కారకాలే ప్రధాన శత్రువులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆ ప్రమాదకరమైన ప్రిజర్వేటివ్స్ ఏంటి? వాటి వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫ్రాన్స్‌లోని ‘యూనివర్సిటీ పారిస్ సిటీ’ పరిశోధకులు సుమారు 1,05,260 మందిపై సుదీర్ఘ కాలం పాటు జరిపిన అధ్యయన ఫలితాలను ‘ది బిఎమ్‌జె (BMJ)’ జర్నల్‌లో ప్రచురించారు. ప్యాక్ చేసిన ఆహారాల్లో వాడే 17 రకాల ప్రిజర్వేటివ్స్ గురించి వారు పరిశీలించగా, అందులో కొన్ని సాధారణ కెమికల్స్ క్యాన్సర్ రిస్క్‌ను విపరీతంగా పెంచుతున్నట్లు గుర్తించారు.
ఆహారం నిల్వ ఉండటానికి వాడే ఈ రసాయనాలు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు)ను పెంచి, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. సహజమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రిజర్వేటివ్స్ పెద్దగా నష్టం చేయకపోయినా.. సోడియం ఎరిథోర్బేట్ వంటి కొన్ని రసాయనాలు మాత్రం అనారోగ్యానికి కారణమవుతున్నాయి.
శాస్త్రవేత్తల సూచనల ప్రకారం, కేవలం ప్రాసెస్డ్ మీట్ లేదా ఆల్కహాల్ మాత్రమే కాదు.. మనం రోజూ వాడే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ప్రమాదకరమే.
బిజీ లైఫ్‌లో ఈజీగా దొరికే ఆహారం మన ఆరోగ్యాన్ని బలి తీసుకుంటోంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లలో మార్పు రావడం అత్యంత అవసరం.